Sathya Sai District News: శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ రెండు కుటుంబాల మధ్య వాషింగ్ మెషీన్ రేపిన చిచ్చులో ఓ మహిళ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. కదిరి పట్టణంలోని మశానంపేటలో పద్మావతి అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఆమె ఇంట్లోని వాషింగ్ మెషిన్ నుంచి వచ్చే వృథా నీరు పక్కనే ఉన్న వేమన్న నాయక్ ఇంటి ముందుకు వెళ్లింది. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది.
మాటామాట పెరిగింది. ఈ క్రమంలోనే వేమన్న నాయక్ కుటుంబ సభ్యులు పద్మావతిపై బండ రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమె ముఖం, తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పద్మావతి మృతి చెందారు. పద్మావతి మృతిపై కేసు నమోదు చేసుకున్న కదిరి పట్టణ పోలీసులు దర్యాప్త చేస్తున్నారు.
గుంటూరులో ప్రేమోన్మాది దాడి..
గుంటూరు జిల్లాలో దారుణం ఘటన జరిగింది. పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. డెంటల్ విద్యార్థినిపై ఐటీ ఉద్యోగి జ్ఞానేశ్వర్ అనే యువకుడు సర్జికల్ బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. తపస్వి అనే విద్యార్థినిపై దాడి చేసిన జ్ఞానేశ్వర్ ఆ తర్వాత తన చేయి కోసుకున్నాడు. జ్ఞానేశ్వర్ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి మృతి చెందింది. అయితే నిందితుడిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పెదకాకాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడు జ్ఞానేశ్వర్ అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
విజయవాడకు చెందిన జ్ఞానేశ్వర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తపస్వితో పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తక్కెళ్లపాడులోని ఓ డెంటర్ కాలేజీలో చదువుతున్న తపస్వి స్నేహితురాలు వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు తన వద్దకు రమ్మని పిలిచింది. దీంతో వారం రోజులుగా తపస్వి తన స్నేహితురాలి వద్ద ఉంటుంది. తపస్విపై పగపెంచుకున్న జ్ఞానేశ్వర్ ఆమె హతమర్చాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం తపస్వి స్నేహితురాలు ఇద్దరికీ రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా ఆ సమయంలో అతడు ఉన్మాదిలా మారిపోయి తపస్విపై దాడి చేసి సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోశాడు. పక్కనున్న తపస్వి స్నేహితురాలు కేకలు వేసి బయటకు పరిగెట్టడంతో స్థానికులు వచ్చారు. దీంతో తలుపులు మూసేసి కొనఊపిరితో ఉన్న తపస్విని రక్తపు మడుగులో ఓ గది నుంచి మరో గదికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. స్థానికులు తలుపులు పగులగొట్టి తపస్విని ఆసుపత్రికి తరలించారు. తపస్వీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. తపస్వీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. తపస్వీపై సర్జికల్ బ్లేడుతో విచక్షణారహితంగా దాడి చేసిన తరువాత, తాను కూడా చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు తెలిపారు.