గుండెపోటు ఎప్పుడొస్తుందో? ఏ వయసులో వస్తుందో కూడా చెప్పడం ఈ కాలంలో చాలా కష్టం. 21 ఏళ్ల యువతకు కూడా గుండె పోటు వస్తున్న సందర్భాలు ఉన్నాయి. గుండెకు రక్త సరఫరా ఆగినప్పుడు గుండె పోటు వస్తుంది. గుండెపోటు వచ్చేటప్పుడు ముఖ్యంగా కనిపించే లక్షణం ఛాతీనొప్పి లేదా ఛాతీలో ఒత్తిడి. అంతేకాదు ఈ నొప్పి గుండె ఉన్న ఎడమవైపు కాకుండా, ఛాతీ మధ్యలో మొదలవుతుంది. చాలా మంది గుండె వైపు రావడం లేదు కదా అని చాలా తేలికగా తీసుకుంటారు. ఛాతీ మధ్యలో మొదలైన నొప్పి అక్కడ్నించి మెడ, దవడ, చెవులు, చేతులు, మణికట్టు వరకు పాకుతుంది. అయితే కేవలం ఛాతీ నొప్పి మాత్రమే గుండె పోటు లక్షణం కాదు, కొన్ని తేలికపాటి, అస్పష్టమైన సంకేతాలను కూడా గుండె పంపిస్తుంది. ఆ సంకేతాలు కనిపించాక వెంటనే గుండెపోటు తీవ్రంగా రాకపోవచ్చు. కానీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని, ఈ లక్షణాలు చెబుతున్నట్టే లెక్క. ఈ లక్షణాలు కనిపించినప్పుడు తేలికపాటి గుండెపోటు వచ్చినట్టే అర్థం చేసుకోవాలి. ఈ సంకేతాలు కనిపించిన కొన్ని నెలలు లేదా ఏళ్ల తరువాత తీవ్రంగా గుండెపోటు రావచ్చు.
ఈ లక్షణాలు....
కొన్ని సెకన్లు లేదా నిమిషాల పాటూ ఈ లక్షణాలు కనిపించి మాయమవుతాయి.
1. వేడిగా అనిపించి ఒళ్లంతా చెమటలు పట్టడం
2. సమస్య ఏమీ లేకపోయినా అనారోగ్యంగా అనిపించడం
3. చర్మం పాలిపోయినట్టు రంగు మారడం
4. భయం వేయడం
5. మెడ, దవడ, వీపు, ఎడమ చేయి కింద లేదా రెండు చేతుల్లో నొప్పి రావడం
6. ఆందోళనగా అనిపించడం
7. శ్వాస సరిగా ఆడకపోవడం
8. కొంతసేపు మైకం కమ్మడం
గుండెపోటును సూచించే ఈ సాధారణ లక్షణాలు పురుషులు, స్త్రీలను బట్టి మారవచ్చు. పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఛాతీ నొప్పి వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. ఛాతీ నొప్పి కాకుండా పైన చెప్పిన ఇతర సంకేతాలను అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Also read: మనదేశంలో బ్రేక్‌ఫాస్ట్ తినడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.