Election Exit Polls: ఎన్నికలు ముగిసిన తర్వాత... ఫలితాలు వచ్చే వరకు నాయకులు తెగ టెన్షన్ పడుతుంటారు. ఫలితాలకు ముందు వారికి కొంత టెన్షన్ తగ్గించేవి ఎగ్జిట్​ పోల్స్. ఎందుకంటే వీటిపై వాళ్లు చాలా నమ్మకం పెట్టుకుంటారు. అయితే ఈ ఎగ్జిట్​ పోల్స్​ కొన్ని సార్లు ఓటరు నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యాయి. కొన్ని సార్లు హిట్ అయితే.. మరికొన్ని సార్లు ఘోరంగా ఫట్ అయ్యాయి. ఆ సందర్భాలు ఓసారి చూద్దాం.

Continues below advertisement


2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు


2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సునామీ సృష్టించిన ఏడాది తర్వాత దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాజపా, ఆమ్​ఆద్మీ, కాంగ్రెస్​ కొదమ సింహాల్లా గర్జించాయి. మోదీ ఏడాది పాలనకు, దేశ రాజధానిలో ఆమ్​ ఆద్మీ బలానికి, 15 ఏళ్ల పాటు దిల్లీని పాలించిన కాంగ్రెస్​ పట్ల ప్రజాభిప్రాయానికి ఈ ఎన్నికలు అద్దం పడతాయని అందరూ అంచనా వేశారు.


70 అసెంబ్లీ స్థానాలు ఉన్న దిల్లీలో ఆప్​ 40-45 సీట్ల వరకు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. అయితే ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఆప్​ 70 సీట్లలో 67 గెలిచి చరిత్ర సృష్టించింది.


బిహార్​ కథ


2015లో బిహార్​లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ప్రధాన పోటీ భాజపా, జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్​ మహాకూటమి మధ్యే. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొనే నేత నితీశ్ కుమార్​ అని కొందరు అభివర్ణించారు. ఎగ్జిట్​ పోల్స్​ భాజపాకు 243 అసెంబ్లీ స్థానాల్లో 100+ వస్తాయని, మహాకూటమి.. కాషాయ పార్టీ వెనుక ఉండొచ్చని అంచనా వేశాయి. ​


అయితే ఫలితాల నాడు మాత్రం కథ తారుమారైంది. ఎన్​డీఏ 58 సీట్లకే పరిమితమైంది. జేడీయూ, ఆర్​ఎల్​డీ నేతృత్వంలోని మహాకూటమి 178 సీట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇక్కడా ఎగ్జిట్​ పోల్స్ ఓటరు నాడి పట్టుకోలేకపోయాయి.


ఎగ్జిట్​ పోల్స్​లో గెలిచారు


2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపు తథ్యమని ఎగ్జిట్​ పోల్స్​ కోడై కూశాయి. కాషాయ పార్టీ ఆ ఎన్నికలకు 'ఇండియా షైనింగ్'​ అనే నినాదంతో బరిలోకి దిగింది. మరోసారి వాజ్​పేయీ ప్రభుత్వం రావడం ఖాయమని అందరూ భావించారు. 543 లోక్​సభ సీట్లలో 230- 275 స్థానాలు ఎన్​డీఏకు వస్తాయని అంచనా వేశాయి ఎగ్జిట్​ పోల్స్​.


ఎన్నికల ఫలితాల వేళ మాత్రం ఎన్​డీఏ 185 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ 218 సీట్లు గెలుచుకుంది. అనంతరం ఎస్పీ, బీఎస్పీ, వామ పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది యూపీఏ.


ఈ సందర్భాలన్నింటా ఎగ్జిట్​ పోల్స్​ విఫలమయినంత మాత్రాన మొత్తానికి నమ్మకూడదు అని చెప్పలేం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడంలో ఎగ్జిట్​ పోల్స్​ సఫలమయ్యాయి.


అయితే ఈ ఎగ్జిట్​ పోల్స్​ కేవలం కొద్ది శాతం మంది ప్రజల అభిప్రాయ సేకరణ మాత్రమేనన్న విషయాన్ని ఓటర్లు సహా నేతలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల పరిస్థితులు, వాతావరణాన్ని అంచనా వేయగలవే గాని ఓటర్ల మనసులో ఏముందో ఏ ఎగ్జిట్​ పోల్స్ చెప్పలేవు.


Also Read: Gujarat Himachal Exit Poll: ఆమ్‌ఆద్మీకి అంతేనా! 2017లో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయా?