Congress leader Jaggareddy: సంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గి అధికారంలోకి వచ్చింది, కానీ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఓటమిపాలైనా వెనక్కి తగ్గడం లేదు. సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమాలకు తన భార్య నిర్మల జగ్గారెడ్డిని ఆహ్వానించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులకు హుకూం జారీ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ అధికారులు తన సూచనలు తప్పకుండా పాటించాలని హెచ్చరించారు. అధికారులు ఎవరు కూడా అశ్రద్ధ, నిర్లక్ష్యం వహించొద్దు అని, ఇది తమ ప్రభుత్వం అని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు (డిసెంబర్ 9న) సోనియా గాంధీ పుట్టిన రోజు (Sonia Gandhi Birthday) అని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Congress ex MLA Jaggareddy). సోనియా గాంధి పుట్టిన రోజు సందర్భంగా మహిళలకు ఈ రోజు తమ ప్రభుత్వం గిఫ్ట్ ఇచ్చిందన్నారు. ఎన్నికలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే, ప్రియాంక గాంధీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన్నట్లు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మొదలు పెట్టాం. ఇకనుంచి మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎటు ప్రయాణం చేసిన టికెట్ అవసరం లేదని, ఉచితంగా వెళ్లిరావొచ్చు అన్నారు జగ్గారెడ్డి.
ఆరోగ్య శ్రీ పథకం కింద 10 లక్షల వరకు పరిమితి పెంచి అమలు చేశాం. కాంగ్రెస్ ప్రకటించిన మిగితా 6 గ్యారెంటీ లో అమలు చేయాల్సిన పథకాలు త్వరలోనే ఒక్కొకటిగా అమలు చేస్తాం. గతంలో నేను ఎమ్మెల్యే గా ఉన్నాను. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేను అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచేవారు. అప్పుడు నేను చాలా హుందాగా వ్యవహరించా. ఎవరినీ ఏమీ అనలేదు. ఇప్పుడు కొన్ని పరిస్థితుల వాళ్ళ నేను ఓడిపోయా. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇకనుంచి నా తరఫున నా భార్య నిర్మల జగ్గారెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతారు. అధికారులు అందరూ నిర్మలకి కార్యక్రమాలపై సమాచారం ఇవ్వాలి.
నిర్మల ఆమె సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా, సంగారెడ్డి నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యే గా చేసిన వ్యక్తిని నేను. అధికారులు ఎవరు అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయొద్దు. ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్ లు, 4 మండల ప్రెసిడెంట్ లు, మా గెలిచినా ఓడినా ప్రతి ప్రజా ప్రతినిధులకు, ఎన్ఎస్ యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసి ఇతర అన్ని సెల్స్ కి సంబందించిన నాయకులకు సైతం సమాచారం అందించాలి’ అని నియోజకవర్గ అధికారులకు జగ్గారెడ్డి గట్టిగానే సూచించారు.
Also Read: మేము ఎల్లప్పుడూ ప్రజల పక్షమే - రైతుబంధు ఎప్పుడు జమ చేస్తారని ప్రభుత్వానికి హరీష్ రావు ప్రశ్న