CM Revanth Reddy Mahalaxmi Scheme Started in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 2 పథకాలను కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రారంభించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'మహాలక్ష్మి' పథకాన్ని (Mahalaxmi Scheme), ఆరోగ్య శ్రీ (Arogyasri) పరిమితిని రూ.10 లక్షలకు పెంచే 'అందరికీ వైద్యం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ లోగో, పోస్టర్లను ఆవిష్కరించి, తెలంగాణ ప్రభుత్వం తరఫున బాక్సర్ నిఖత్ జరీన్ కు రూ.2 కోట్ల చెక్కు అందజేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతికుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందించే తొలి బస్సును సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా మహిళలతో పాటు బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రభుత్వం నిర్దేశించిన బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో నడిచే సిటీ ఆర్డీనరీ, సిటీ మెట్రో బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం చెయ్యొచ్చని చెప్పారు. అంతర్రాష్ట్ర ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకూ ఈ సదుపాయాన్ని పొందవచ్చని స్పష్టం చేశారు.
'6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు'
ఇవాళ తెలంగాణ ప్రజలకు పండుగ రోజని 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపమే కనిపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడి ప్రజల కోసమే కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ఇచ్చిందని, వాటిలో రెండు హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వివరించారు. మహిళలు నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని అన్నారు. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సైతం కచ్చితంగా 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. సంక్షేమాన్ని 100 శాతం తెలంగాణ ప్రజలకు అందించి ఓ సంక్షేమ రాజ్యంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.