Harishrao Comments at Assembly Point: తాము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పటికీ ప్రజల పక్షానే నిలబడతామని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన నేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం రైతు బంధు ఎప్పుడు ఇస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రైతు బంధు (Rythu Bandhu) కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పారని, అది ఎప్పుడిస్తారో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో రైతాంగం అంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోందని తెలిపారు. 'రైతులు వడ్లు అమ్ముకోకండి. తాము అధికారంలోకి వచ్చాక కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. రూ.500 బోనస్ తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలి.' అని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే, మిగ్ జాం తుపాను కారణంగా కొన్నిచోట్ల వడ్లు తడిశాయని, అలాంటి రైతులను ఆదుకోవాలని కోరారు.






బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్


మరోవైపు, బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నికయ్యారు. శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో విజయం సాధించి బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో నిలిచిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఎన్నిక అనంతరం ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు గన్ పార్కు వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులర్పించారు. శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్, ఆయనతో పాటు ఆస్పత్రిలో ఉన్నందున కేటీఆర్ నేటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. ఈ మేరకు తమకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసన సభ సెక్రటరీని కేటీఆర్ కోరారు. అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం ఈ నెల 14కు (గురువారం) వాయిదా పడింది. అటు బీఆర్ఎస్ నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు విజయం సాధించారు. దీంతో వారు రెండిట్లో ఒక పదవికి రాజీనామా చేయాలి. ఈ రోజు అసెంబ్లీకి వచ్చే ముందు ముగ్గురు ఎమ్మెల్సీలు శాసన మండలికి వెళ్లి తమ రాజీనామాలను సమర్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలకు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఆ తర్వాత వారు అసెంబ్లీకి వెళ్లారు. 


Also Read: KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా