BRS MLAs In Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి. సభ్యులంతా ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ ఉండటంతో.. ఆయన ఆధ్వర్యంలో తాము ప్రమాణ స్వీకారం చేయబోమని బీజేపీ నేతలు సభకు గైర్హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి కేసీఆర్, కేటీఆర్ కూడా తొలిరోజు సభకు గైర్హాజరయ్యారు. అనారోగ్య పరిస్థితుల వల్ల కేసీఆర్ ఈరోజు సభకు రాలేదు. అయితే ఆయన్ను బీఆర్ఎస్ నేతలంతా శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కేసీఆర్ అనారోగ్యం వల్ల ఈరోజు కేటీఆర్ కూడా సభకు హాజరు కాలేదు. ప్రమాణ స్వీకారానికి తనకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కేటీఆర్ కోరారు. ఇక బీజేపీ నేతలు కూడా రెగ్యులర్ స్పీకర్ వచ్చిన తర్వాతే తమ ప్రమాణాలు ఉంటాయని స్పష్టం చేశారు. 


బీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్ ని ఎన్నుకున్న అనంతరం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. గన్‌ పార్క్‌ లోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అమరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. జై తెలంగాణ అంటూ అక్కడినుంచి శాసన సభకు చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా కేసీఆర్‌ ను ఎన్నికున్నట్లుగా తీర్మానం కాపీని స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. 


సస్పెన్స్ వీడింది..
బీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాకుండా మరో వ్యక్తి ఉంటారని ఇటీవల ఊహాగానాలు చెలరేగాయి. కేసీఆర్ అసెంబ్లీకి రారని, ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి, జాతీయ రాజకీయాల్లో బిజీ అవుతారని కూడా అనుకున్నారు. కానీ ఇప్పటికిప్పుడు అలాంటి ఆలోచన కేసీఆర్ కి లేదని తేలిపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ నే లేజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. అంటే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడతారనే విషయం ఖాయమైంది. 


కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్..
ఇక అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరు మొదలయ్యేలా కనపడుతోంది. కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై చేస్తున్న వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య మరింత మంట పెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్ శాఖ విషయంలో గతప్రభుత్వం మోపిన భారంపై కాంగ్రెస్ నుంచి విమర్శలు వినపడుతున్నాయి. వీటికి ధీటుగా బీఆర్ఎస్ బదులిచ్చే అవకాశముంది. అసెంబ్లీలో కూడా ఇవే అంశాలు ప్రస్తావనకు వస్తాయని అంటున్నారు. ఇక ఆరు గ్యారెంటీలపై కూడా కాంగ్రెస్ ని బీఆర్ఎస్ వెంటపడే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతోంది. మొత్తమ్మీద ఈరోజు మొదలైన అసెంబ్లీ సమావేశాలు.. ఎంత ఆసక్తిగా సాగుతాయో చూడాలి. 


ఎమ్మెల్సీ పదవులకు ముగ్గురు రాజీనామా..
బీఆర్ఎస్ నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు విజయం సాధించారు. దీంతో వారు రెండిట్లో ఒకపదవికి రాజీనామా చేయాలి. ఈరోజు అసెంబ్లీకి వచ్చేముందు ముగ్గురు ఎమ్మెల్సీలు శాసన మండలికి వెళ్లి తమ రాజీనామాలను సమర్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలకు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఆ తర్వాత వారు అసెంబ్లీకి వెళ్లారు.