Congress Review on Election Results:


కాంగ్రెస్ రివ్యూ..


ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది కాంగ్రెస్. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో అధికారంలో ఉన్నప్పటికీ దాన్ని కాపాడుకోలేకపోయింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ మెజార్టీ సాధించింది. ఈ ఫలితాలపై హైకమాండ్‌ రివ్యూ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే...ఆయా రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ సమయంలోనే వాళ్లపై హైకమాండ్‌ తీవ్రంగా మండి పడినట్టు సమాచారం. వాళ్ల వల్లే పార్టీ ఓడిపోయిందని విమర్శించినట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో ప్రచార బాధ్యతల్ని మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో పాటు దిగ్విజయ్ సింగ్‌కి అప్పగించింది అధిష్ఠానం. ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌కే  బాధ్యతలు ఇచ్చింది. అయితే...ఈ బాధ్యతల్ని వాళ్లు సరైన విధంగా నిర్వర్తించలేదని హైకమాండ్‌ అసహనం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ ప్రచారాన్ని కౌంటర్ చేసే విధంగా సరైన ప్లాన్‌తో ముందుకు వెళ్లలేదని మండిపడినట్టు సమాచారం. అంతే కాదు. ముందుగానే ఓటమిని అంగీకరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకమాండ్. మధ్యప్రదేశ్‌లో ఓటమికి బాధ్యత వహిస్తూ కమల్‌నాథ్‌ పార్టీ చీఫ్‌ పదవి నుంచి దిగిపోవాలని ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా ఆ పదవిలో కొనసాగేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని కొందరు చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ఆయా రాష్ట్రాల పార్టీ చీఫ్‌లతో కఠినంగానే మాట్లాడారట. 


ఛత్తీస్‌గఢ్‌లో తక్కువ సీట్లు..


అటు ఛత్తీస్‌గఢ్‌లోనూ భూపేష్‌ లీడర్‌షిప్‌పై హైకమాండ్‌ కాస్త అసహనంగానే ఉంది. గత ఎన్నికల్లో 68 సీట్లు సాధించుకుంది కాంగ్రెస్. ఆ తరవాత ఆ సంఖ్య 71కి చేరుకుంది. కానీ...ఇటీవల జరిగిన ఎన్నికల్లో అది 35 సీట్లకే పరిమితమైంది. 2003లో ఛత్తీస్‌గఢ్ ఏర్పాటైన తరవాత కాంగ్రెస్‌కి ఇంత తక్కువ సీట్లు రావడం ఇదే తొలిసారి. మొత్తం మూడు రాష్ట్రాలకు చెందిన 11 మంది కీలక నేతలు హైకమాండ్‌తో భేటీ అయ్యారు. ఈ 3 రాష్ట్రాల్లోనూ మహిళా అభ్యర్థులు ఎక్కువగా ఓట్లు రాబట్టుకోగలిగారని, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టాలని హైమాండ్ ఆదేశించింది. ఇదే సమయంలో పార్టీలోని సమస్యల్ని, వెనకబడిపోవడానికి గల కారణాలనీ విశ్లేషించుకుంది. ఛత్తీస్‌గఢ్ విషయంలోనూ ఎందుకు బెడిసికొట్టిందో రివ్యూ చేసుకుంది. గ్రామాల్లోని ఓట్లన్నీ తమకే పోల్ అవుతాయని ధీమాగా చెప్పింది కాంగ్రెస్. కానీ...అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. పూర్తిగా బీజేపీవైపు మొగ్గారు ఓటర్లు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. హైకమాండ్‌తో నిర్వహించిన భేటీలో కొందరు నేతలు EVM ల పనితీరుపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. మరి కొన్ని కీలక అంశాలపైనా చర్చ జరిగినప్పటికీ వాటి గురించి బయట పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపించడం లేదు. అవన్నీ అంతర్గత విషయాలు అని తేల్చి చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ తప్పులు జరగకుండా చూసుకుంటామని అంటున్నారు. 


 Also Read: UP Crime: టెస్ట్ చేస్తుండగా పేలిన గన్, మహిళ తలలోకి బులెట్ - పోలీస్ స్టేషన్‌లోనే ఘటన