2024 ఎన్నికలు టీడీపీకి లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే తర్వాత పార్టీ ఎలా ఉంటుందో చెప్పలేం. ఇప్పటి వరకు చంద్రబాబు పూర్తి యాక్టివ్ గా ఉన్నారు. అన్ని వ్యవహారాలు తానే చూసుకుంటున్నారు. వచ్చేదఫా ఆయన ఇంత యాక్టివ్ గా ఉండకపోవచ్చు. వయోభారంతో ఆయన పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండే అవకాశం లేదు. అందుకే 2024 ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనేది చంద్రబాబు వ్యూహం. ఆ వ్యూహానికి తగ్గట్టు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారాయన. పార్టీ టికెట్ల వ్యవహారంపై కూడా మందుగానే హింట్ ఇచ్చేశారు. 


గెలుపు గుర్రాలకే టికెట్లు..
గతంలో మొహమాటాలకోసం, సీనియర్లకు ప్రయారిటీ ఇవ్వడం కోసం, సీనియర్ల వారసుల కోసం కొన్ని టికెట్లు కేటాయించేవారు. కొన్నిచోట్ల గెలవరు అని తెలిసినా కూడా మొహమాటం కోసం పార్టీ బీఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు టీడీపీ అవసరం ఎంతో ఉందని చెప్పారాయన. గెలిచే అవకాశం ఉన్న వారికే ఈసారి టికెట్లు ఇస్తానన్నారు. నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పనితీరు బాగాలేకపోతే.. వారికి ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతానని కుండబద్దలు కొట్టారు. 


ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని చెప్పారు చంద్రబాబు. ఇక ఓట్ల అవకతవకల విషయంపై కూడా అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దొంగఓట్లు, ఓట్ల తొలగింపు విషయంలో ఇన్‌ ఛార్జ్‌ లు బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో అన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటుందనే అలసత్వం వద్దని నాయకులకు హితవు పలికారు. 


తెలంగాణ ఫార్ములా..
తెలంగాణలో ఈసారి ఎన్నికల ఫలితాలు ఏపీకి కూడా పెద్ద పాఠంగా మిగిలాయి. బీఆర్ఎస్ విషయానికొస్తే.. సిట్టింగ్ లకే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. కొంతమందిపై వ్యతిరేకత ఉందని తెలిసినా కూడా ఆయన ప్రయోగం చేయలేదు. చివరి నిమిషంలో కొన్నిచోట్ల కొత్తవారికి అవకాశమివ్వగా.. వారిలో ఎక్కువమంది గెలిచారు. మంత్రులు సైతం ఎన్నికల బరిలో మట్టికరవడం విశేషం. కాంగ్రెస్ విషయానికొస్తే.. పాతకాపులకే ప్రయారిటీ ఇచ్చినా కొన్నిచోట్ల నిర్మొహమాటంగా చాలామందిని తప్పించారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిపై చాలా విమర్శలు వచ్చాయి. కొత్తగా పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చారని, టికెట్లు అమ్ముకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ రేవంత్ అవేవీ పట్టించుకోలేదు. రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు అప్పటికప్పుడు పార్టీలో చేరినా.. గెలుస్తారు అనుకున్నారు కాబట్టే టికెట్ ఇచ్చారు. అలాంటి చోట్ల పాల్వాయి స్రవంతి వంటి నేతల్ని పక్కనపెట్టారు. వారు పార్టీ మారుతున్నా పట్టించుకోలేదు. అంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇప్పించుకున్నారు రేవంత్ రెడ్డి, తను అనుకున్నది సాధించారు. 


ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి ఫార్ములానే చంద్రబాబు ఫాలో అవ్వాలనుకుంటున్నారు. గెలుపు మాత్రమే అంతిమ లక్ష్యం అంటున్నారాయన. సీనియర్ల విషయంలో మొహమాటాలు చెల్లవని తేల్చి చెప్పారు. అంటే టీడీపీలో కూడా టికెట్ల కేటాయింపు సంచలనంగా మారే అవకాశముంది. మరోవైపు జనసేనకు కేటాయించే టికెట్లపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. రెండు పార్టీల్లోనూ గెలుపు గుర్రాలకే అవకాశాలుంటాయి. ఎవరు ఏ టికెట్ పై పోటీ చేసినా, ఎక్కడ ఏ స్థానం ఏ పార్టీకి ఇవ్వాల్సి ఉన్నా.. అంతిమంగా అందరూ గెలిచి అసెంబ్లీకి రావాలి.. టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడాలి.. ఇదే చంద్రబాబు లక్ష్యం. మరి ఈ లక్ష్యాన్ని ఆయన చేరుకుంటారో లేదో చూడాలి.