Israel Gaza War:


ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంపై తీర్మానం..


ఇజ్రాయేల్, గాజా యుద్ధంపై (Israel-Hamas War) ఐక్యరాజ్య సమితిలో ఓ తీర్మానం ప్రవేశపెట్టగా అమెరికా వీటో అధికారంతో తోసిపుచ్చింది. గాజాని పూర్తిగా ధ్వంసం చేస్తున్న యుద్ధాన్ని ఇప్పటికిప్పుడు ఆపేయాలని ఈ తీర్మానం తేల్చి చెప్పింది. అక్కడి ప్రజలకు మానవతా సాయం అందించేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని (UN Security Council) అన్ని దేశాలూ దీనికి సానుకూలంగా స్పందించగా అమెరికా మాత్రం కొట్టిపారేసింది. యూకే మాత్రం ఈ ఓటింగ్‌కి దూరంగా ఉంది. ఫ్రాన్స్, జపాన్ ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. అయితే...అమెరికా వీటో అధికారాన్ని ఉపయోగించడంపై మిగతా దేశాలు అసహనం వ్యక్తం చేశాయి. ఇలా చేయడం వల్ల మరి కొంత మంది అమాయక ప్రజల ప్రాణాల్ని బలి అవుతాయని హెచ్చరించాయి. ముఖ్యంగా యూఏఈ (UAE) ఈ విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వీటో వినియోగించడం ద్వారా అమెరికా ఎలాంటి సందేశమివ్వాలని అనుకుంటోందో అర్థం కావడం లేదని మండి పడింది. పాలస్తీనా ప్రజల  కోసం అందరూ ఒక్కటి కాకపోతే ఎలా అని ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితే అమెరికాకి వస్తే అప్పుడు ఏం చేస్తారని విమర్శించింది. అయితే...దీనిపై అమెరికా డిప్యుటీ అంబాసిడర్‌ వివరణ ఇచ్చారు. ఈ తీర్మానం "బ్యాలెన్స్‌డ్‌"గా లేదని తేల్చి చెప్పారు. భద్రతా మండలి తీరుపైనా మండి పడ్డారు. మిలిటరీ యాక్షన్‌ని ఆపేయడం వల్ల నష్టం ఇంకా భారీగా ఉంటుందని, మరో యుద్ధాన్ని స్వాగతించినట్టవుతుందని అన్నారు. 


"హమాస్ ఉగ్రవాదులకు శాంతియుత వాతావరణం నెలకొల్పాన్న ఆలోచనే లేదు. రెండు వర్గాలు ప్రశాంతంగా ఉండాలంటే ఈ యుద్ధం కొనసాగాల్సిందే. ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని నిలిపివేస్తే దాని వల్ల జరిగే నష్టం భారీగా ఉంటుంది. అందుకే..మేం దీనికి మద్దతునివ్వడం లేదు. మరో యుద్ధాన్ని స్వాగతించినట్టవుతుంది"


- అమెరికా అంబాసిడర్ 


అమెరికా ఈ వివరణ ఇచ్చినప్పటికీ మిగతా దేశాలు మాత్రం అసహనంగానే ఉన్నాయి. అంతర్జాతీయంగా శాంతిని నెలకొల్పాలన్న భద్రతా మండలి లక్ష్యానికి ఇది విరుద్ధంగా ఉందని చెబుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే యుద్ధం ఆపాలన్న ఆలోచనను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తున్నాయి. అటు పాలస్తీనా కూడా అమెరికా వీటో వినియోగించడంపై అసహనంగా ఉంది.