హారర్, థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఏడాది వచ్చిన 'విరూపాక్ష' మంచి సక్సెస్ అందుకుంది. అటువంటి సినిమా మరొకటి వస్తుందని 'తంత్ర' చూస్తుంటే అర్ధం అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పదహారణాల అచ్చమైన తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల (Ananya Nagalla). 'ప్లే బ్యాక్', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలతో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఆమె ఓ హారర్ థ్రిల్లర్ చేశారు. అనన్యా నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'తంత్ర' (Tantra Movie). దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్ రఘుముద్రి హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది.
'తంత్ర'లో రాజమౌళి హీరోయిన్ కూడా!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాద రామన్న'లో కథానాయిక సలోని గుర్తు ఉన్నారా? ధనుష్, అనన్యా నాగళ్ళతో పాటు 'తంత్ర'లో నటిస్తున్నారు. ఆమె తెలుగు రీ ఎంట్రీ ఇది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వి ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలపై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా టీజర్ విడుదల చేశారు.
'కాలగర్భంలో కలసిపోయిన మన తాంత్రిక శాస్త్రాన్ని తెరిస్తే... అందులో ఊహకు అందని రహస్యాలు ఎన్నో' అంటూ 'తంత్ర' టీజర్ ప్రారంభమైంది. అది చూస్తే... ఓ ఊరిలో రాత్రివేళ ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళుతుంది. ఆ ఊరిలో దుష్టశక్తి పుట్టిందని మరో గొంతు వినిపిస్తుంటే... తెరపై క్షుద్రపూజలు వంటివి కనిపించాయి.
'ఊరిలో జన్మించిన దుష్టశక్తి పెరిగి పెద్దదైన తర్వాత రక్త దాహంతో విరుచుకు పడుతూ ప్రాణాలు తోడేస్తుంది' అంటూ వాయిస్ వినిపిస్తుంటే... రక్తం కక్కుతూ తెరపై అనన్య కనిపించారు. దుష్టశక్తి ఎవరి మృత్యువు కోరింది? ఏమైంది? అనేది సినిమాలో చూడాలి. టీజర్ చూస్తే... 'విరూపాక్ష' వైబ్స్ కలిగాయి. తాంత్రికుడిగా 'టెంపర్' వంశీ కనిపించారు. అనన్య, సలోని క్యారెక్టర్లు ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో సందడి చేస్తున్న అనన్య... ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేశారనేది అర్థం అవుతోంది.
''మహిళా ప్రాధాన్య చిత్రమిది. ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్ ఎంటర్‌టైనర్. పురాణ గాథలు, భారతీయ తాంత్రిక శాస్త్రం నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగే చిత్రమిది'' అని దర్శక నిర్మాతలు తెలిపారు.'తంత్ర'లో అనన్యా నాగళ్ల, ధనుష్, సలోని, 'టెంపర్' వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : ఎస్.బి. ఉద్దవ్ (భలే భలే మగాడివోయ్, మిథునం), ఛాయాగ్రహణం : సాయి రామ్ ఉదయ్ (రాజు యాదవ్ ఫేం) - విజయ భాస్కర్ సద్దాల, సంగీతం: ఆర్‌ఆర్ ధృవన్ (క్రేజీ ఫెలో, మైల్స్ ఆఫ్ లవ్), నిర్మాణ సంస్థలు : ఫస్ట్ కాపీ మూవీస్ - బి ద వే ఫిల్మ్స్ - వి ఫిల్మ్ ఫ్యాక్టరీ, నిర్మాతలు : నరేష్ బాబు పి - రవి చైతన్య, దర్శకత్వం: శ్రీనివాస్ గోపిశెట్టి.