Gundlakamma Reservoir Gate Damage: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన రెండో గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. ఇప్పటికే ఓ గేటు కొట్టుకుపోయి ఏడాది గడిచినా దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేయలేదు. కాగా, శుక్రవారం రాత్రి 8:45 గంటలకు మరో గేటు కూడా విరిగి కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టులో నీళ్లన్నీ వృథాగా సముద్రం పాలవుతున్నాయి. జలాశయం కింద కుడి, ఎడమ కాలువల పరిధిలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వాయర్ లో చేపల వేటతో 2 వేలకు పైగా మత్స్యకార కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు చర్యలు చేపట్టారు.


సముద్రంలోకి వృథాగా నీరు


గుండ్లకమ్మ రిజర్వాయర్ గేటు కొట్టుకుపోవడంతో సముద్రంలోకి నీళ్లు వృథాగా పోతున్నాయి. జలాశయం పూర్తి సామర్థ్యం 3.8 టీఎంసీలు కాగా, గతేడాది ఆగస్టులో 3వ గేటు కొట్టుకుపోయే సమయానికి జలాశయంలో 3 టీఎంసీల నీళ్లున్నాయి. ఆ సమయంలో 1.5 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోయాయి. అయితే, గేటు మరమ్మతు చేయాలంటే మొత్తం జలాశయం ఖాళీ చేయాలని ఇంజినీరింగ్ అధికారులు సూచించారు. ఈ క్రమంలో ఆ గేటుకు తాత్కాలిక మరమ్మతు చేసిన తర్వాత జలాశయంలో నీటి నిల్వను 1.7 టీఎంసీలకే పరిమితం చేశారు. మిగ్ జాం తుపాను ముందు జలాశయంలో 1.3 టీఎంసీలే ఉన్నాయి. తుపాను కారణంగా భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో ఎక్కువగా వచ్చింది. దీంతో 2.5 టీఎంసీల నీరు జలాశయంలో చేరగా, బుధవారం 2 గేట్లు ఎత్తి కొంత నీరు దిగువకు వదిలారు. ఈ క్రమంలో ప్రవాహ ధాటికి రెండో గేటులోని అడుగు భాగం కొంత కొట్టుకుపోయింది. దీంతో శుక్రవారం రాత్రి వరకూ అర టీఎంసీల నీరు వృథాగా  పోయినట్లు తెలుస్తోంది. గేటు కొట్టుకుపోవడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో అధికారులు అక్కడ విద్యుత్ సరఫరా నిలిపేశారు. వరద నీరు దిగువకు పోటెత్తుతుండడంతో జలాశయం పరీవాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తాజాగా ఆయా గ్రామాల్లో దండోరా వేయించారు. ఈ క్రమంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గేటుకు మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.


మరమ్మతులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు


గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్మించి 15 ఏళ్లు పూర్తి కాకముందే గేట్లు తుప్పు పట్టేశాయని స్థానికులు చెబుతున్నారు. మొత్తం 15 గేట్లలో చాలా వరకూ పాడయ్యాయని, వాటిని మార్చాలని నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. మరమ్మతులకు రూ.3 కోట్లతో సర్కారుకు ప్రతిపాదనలు సైతం పంపారు. 2022 జూన్ నెలలో రూ.98 లక్షలు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర అధికారులు సందర్శించి, మొత్తం 12 గేట్లు బాగు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో అధికారులు చర్యలు చేపడుతున్నారు. 


నారా లోకేశ్ విమర్శలు


సీఎం జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజాధనం దోచి దాచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. టీఎంసీకి, క్యూసెక్కుకు తేడా తెలియని వారికి నీటి పారుదల శాఖ కట్టబెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరు మారకుంటే ప్రాజెక్టుల వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


Also Read: Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్‌ క్లోజ్‌