Russia Ukraine War:


ఓ చేతిలో కాఫీ కప్, మరో చేతిలో గన్..


రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాదాపు 11 నెలలుగా రెండు దేశాలు తలపడుతూనే ఉన్నాయి. అటు రష్యా సైనిక చర్యను ఆపడం లేదు. ఇటు ఉక్రెయిన్ కూడా వెనక్కి తగ్గడంలేదు. ఇరు దేశాల సైన్యాలు యుద్ధ రంగంలో పోరాడుతున్నాయి. ఈ క్రమంలోనే...ఉక్రెయిన్‌ సైనికుడి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రష్యా సైనికులపై ఫైరింగ్ జరుపుతున్న తీరు అందరినీ షాకింగ్‌కి గురి చేస్తోంది. Sun యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి "వావ్" అంటున్నారంతా. ఉక్రెయిన్ సైనికుడు సింపుల్‌గా కాఫీ కప్‌ చేతిలో పట్టుకున్నాడు. రెండు, మూడు సిప్‌లు వేశాడు. కాసేపు ఆ రుచిని ఆస్వాదించాడు. ఇంతలో దూరం నుంచి ఫైరింగ్ చేసిన సౌండ్ వినిపించింది. వెంటనే అలెర్ట్ అయిపోయాడు. కాఫీ కప్ కింద పెట్టేసి..ఎడమ చేతిలో ఉన్న గన్‌ను రెండు చేతుల్తో పట్టుకుని...రష్యా సైనికులపై కాల్పులు జరిపాడు. కాసేపయ్యాక మళ్లీ గన్ కింద పెట్టేసి కాఫీ కప్ చేతుల్లోకి తీసుకుని సిప్ చేస్తూ ఆస్వాదించాడు. ఇది చూసిన నెటిజన్లు "ఇంత కూల్‌గా ఎలా ఉన్నాడో"  అని ఆశ్చర్యపోతున్నారు. ఎదురుగా రష్యా సైనికులు ఆపకుండా ఫైరింగ్ జరుపుతూనే ఉన్నారు. ఈ సోల్జర్ మాత్రం ఎలాంటి భయం, బెరుకు లేకుండా కాఫీని ఎంజాయ్ చేస్తూ...శత్రువులపై ఫైరింగ్ జరిపాడు. 



డ్రోన్‌ల దాడి..


రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై డ్రోన్‌లతో దాడికి దిగింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కీవ్‌పై జరిగిన దాడుల్లో ఇదే అత్యంత ఘోరమైన దాడిగా ఉక్రెయిన్ వ్యాఖ్యానించిన తర్వాత రష్యా యుద్ధ తీవ్రతను పెంచింది. దాదాపు  20కి పైగా ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం గగనతలంలో గుర్తించారు. వాటిలో పదిహేను డ్రోన్లను కూల్చివేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఈ దాడిలో కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంసం అయినట్టు కీవ్ నగర పాలక సంస్థ పేర్కొంది. వీటితో పాటు కొన్ని ఇళ్లు ధ్వంసం కాగా, ఇద్దరికి గాయాలయ్యాయని అని కీవ్ నగర గవర్నర్  ఓలెక్సీ కులెబా తెలిపారు. అజోవ్ సముద్రం తూర్పు వైపు నుంచి రష్యా పంపించిన 35 డ్రోన్లలో 30కి పైగా నాశనం చేసినట్టు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. గత శుక్రవారం రష్యా ఉక్రెయిన్ పై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ దాడుల్లో భాగంగానే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై దాడి జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు శుక్రవారం 70కిపైగా క్షిపణులు ప్రయోగించాయి. వరుస పరాజయాల తర్వాత అక్టోబర్ నుంచి వారానికోసారి ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తుండగా యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు.


Also Read: Kashmiri Pandits: ఆఫీస్‌కు రాకుండా ఇంట్లో కూర్చుంటే జీతాలివ్వం - కశ్మీరీ పండిట్‌లకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వార్నింగ్