Russia-Ukraine War: 



చర్చ్‌లో నిరసన..


రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది దాటింది. ఇంకా అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా పట్టుదల వీడడం లేదు. అటు ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం లేదు. రెండు దేశాల్లోనూ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు సామాన్య పౌరులూ ఈ దాడుల కారణంగా కన్ను మూశారు. ఫలితంగా...ప్రజల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగానూ కొన్ని దేశాల్లో ఈ యుద్ధంపై వ్యతిరేకత పెరుగుతోంది. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా చర్చ్‌లో ఓ వ్యక్తి వింతగా నిరసన తెలిపాడు. చర్చ్‌లోకి వచ్చి అక్కడే ఉన్నట్టుండి బట్టలు మొత్తి విప్పేసి నిలబడ్డాడు. చిన్నారుల ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చాడు. నగ్నంగా చాలా సేపు నిరసన వ్యక్తం చేశాడు. అక్కడితో ఆగలేదు. గోళ్లతో తనను తానే గాయపరుచుకున్నాడు. అయితే...చర్చ్‌ గార్డ్స్‌ వెంటనే వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి పేరేంటి..? ఎక్కడుంటాడు..? అన్న వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. చర్చ్‌ మూసేసే ముందు వచ్చి హడావుడి చేశాడు. ఇటలీ మీడియా ఆ వ్యక్తి ఫోటోలను పబ్లిష్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇలా వింతగా నిరసన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల జరిగిన కేన్స్ ఫెస్టివల్‌లోనూ ఓ మహిళ ఒళ్లంతా రక్తం పూసుకుంది. గమనించిన వెంటనే గార్డ్‌లు ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్లారు. 


ఎంపీ పిడిగుద్దులు..


రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా వైరం చల్లారలేదని మరోసారి రుజువైంది. ఇటీవలే పుతిన్ బిల్డింగ్‌ డ్రోన్‌లు తిరగడం రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచింది. ఇప్పుడు ఓ రష్యన్ ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ చేయి చేసుకోవడం సంచలనమవుతోంది. ఓ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఈ ఇద్దరు నేతలు గల్లా పట్టుకుని కొట్టుకున్నారు.టర్కీ రాజధాని అంకారాలోని ఓ సదస్సుకి ఈ ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 14 నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో వీళ్లు ఒకే వేదికపైకి రావడం ఆసక్తిని పెంచింది. అయితే...ఉక్రెయిన్ ఎంపీ ఒకరు నేషనల్ ఫ్లాగ్‌ని పట్టుకుని నిలబడి ఉన్న సమయంలో రష్యన్ ప్రతినిధి వచ్చి ఆ జెండాను లాగేసుకున్నారు. అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఇది చూసిన ఉక్రెయిన్ ఎంపీ కోపంతో ఊగిపోయాడు. ఆ వ్యక్తిని తరుముకుంటూ వెళ్లాడు. జెండా మళ్లీ తిరిగి లాక్కునేందుకు ప్రయత్నించాడు. కానీ రష్యన్ ప్రతినిధి ఆ జెండాను గట్టిగా పట్టుకున్నాడు. సహనం నశించిన ఉక్రెయిన్ ఎంపీ పిడి గుద్దులతో విరుచుకు పడ్డాడు. జెండా తిరిగి తన చేతుల్లోకి లాక్కున్నాడు. ఈ గొడవతో ఒక్కసారిగా అక్కడి వాళ్లంతా ఉలిక్కి పడ్డారు. ఘర్షణ పెరిగే ప్రమాదముందని గుర్తించి ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాసేపటికి ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఇంటర్నేషనల్ మీటింగ్‌లో ఇలా కొట్టుకోవడం ఏంటని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: Viral Video: స్టేజ్‌పై నడుస్తూ కింద పడిపోయిన బైడెన్, బ్యాగ్ తెచ్చిన తంటా