ఆహారం, వ్యాయామం, నిద్ర ఇవే ఆరోగ్యాన్ని నిర్ణయించేవి. పోషకాలు కలిగిన సమతుల ఆహారం, తగినంత వ్యాయామం, సరిపడినంత నిద్ర వీటిలో ఏది తగ్గినా ఆరోగ్యం మీద తప్పకుండా ప్రభావం చూపుతుంది. అయితే వీటిలో నిద్ర అత్యంత ముఖ్యమైంది. సరైన సమయంలో సరిపడినంత నిద్ర పోవడం అత్యవవసరం సహజంగా నిద్రలోకి జారుకుని నిద్ర పోయే వారితో పోలిస్తే స్లీపింగ్ పిల్స్ సహాయంతో నిద్ర పోయే వారు అకాలమరణం బారిన పడే ప్రమాదం 55 శాతం ఎక్కువట. ఇది పురుషుల సగటు జీవిత కాలంలో 5.5 సంవత్సరాలుగా ఉంటే స్త్రీలలో 5.7 సంవత్సరాల కాలంగా పరిగణించవచ్చు.
ఇలా స్లీపింగ్ పిల్స్ వాడి 8 గంటల కంటే ఎక్కువ సమయం పాటు నిద్రలో గడిపే వారికి ఈ ప్రమాదం రెట్టింపుగా కూడా ఉండొచ్చని పరిశోధకులు అంటున్నారు.
నేషనల్ తైవాన్ యూనివర్సిటికి చెందిన యుసన్ అనే శాస్త్రవేత్త చెప్పినదాన్ని బట్టి సహజంగా నిద్రలోకి జారుకోలేని వ్యక్తులు చాలామంది పిల్స్ మీద ఆధారపడుతున్నారట. ఇవి వాడడం వల్ల మరణానికి దగ్గరవుతున్నారన్న నిజం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిద్రలేమికి ఇక నుంచి నిద్రమాత్రలు వాడకపోవడమే మంచిదని తాము సూచిస్తున్నామని కూడా అంటున్నారు. సులభంగా నిద్ర పోవచ్చనే కారణంతో ఇవి తీసుకోవడానికి మొగ్గు చూపుతారు కానీ ఇతర పద్ధతుల్లో ప్రయత్నించడమే మంచిదని ఈ పరిశోధనలో పాల్గొన్న నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు నిద్ర లేమితో బాధపడుతున్నారు. వయోజనుల్లో చాలా మందికి ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర ఉండడం లేదు. ఇలా తక్కువ నిద్ర పోవడం వల్ల మానసిక సమస్యలు మాత్రమే కాదు గుండెజబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులు కూడా ఎదురుకావచ్చు.
పరిశోధన ఇలా సాగింది
పరిశోధకులు 1994 నుంచి 2011 వరకు 4,84,916 మంది స్లీపింగ్ పిల్స్ వాడే పెద్దవారిలో మరణ ప్రమాదాన్ని, తగ్గిపోతున్న ఆయుర్ధాయాన్ని గుర్తించారు. వీరిని 4 గ్రూపులుగా విభజించారు. నాలుగు గంటలు అంతకంటే తక్కువ నిద్రపోయేవారు, నాలుగు నుంచి ఆరు గంటలు నిద్రపోయే వారు, ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయే వారు. వీరిలో అందరూ ప్రిష్కిప్షన్ స్లీపింగ్ పిల్స్ వాడుతారా? క్రమం తప్పకుండా పిల్స్ తీసుకుంటారా వంటి ప్రశ్నలు వేశారు.
నాలుగు గంటల లోపు మాత్రలు వేసుకున్న వారితో అసలు మాత్రలు తీసుకోని వారితో పోలిస్తే మరణ ప్రమాదం విషయంలో చాలా తక్కవు వ్యత్యాసం ఉంది. అయితే నాలుగు నుంచి ఆరుగంటల నిద్రకోసం మందులు తీసుకునే వారిలో ముందుగా చనిపోయే ప్రమాదం 32 శాతం ఎక్కువ.
Also read : ఈ జీవులతో జాగ్రత్త - కరవడమే కాదు, చర్మంలో గుడ్లు కూడా పెట్టేస్తాయ్!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.