ఆగస్ట్ 11న రాజ్యసభలో జరిగిన ఆందోళన గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలు ఛాయ వర్మ, ఫూలో దేవీ నేతమ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు మార్షల్స్ తమపై చేయిచేసుకున్నారని ఆరోపించారు.
ఆగస్టు 11న జరిగిన చివరిరోజు వర్షాకాల సమావేశంలో రాజ్యసభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 127వ రాజ్యంగ సవరణ చట్టం 2021 ప్రవేశపెట్టగానే రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు.
ఆ తర్వాత వెంటనే ఇన్సూరెన్స్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలో నిరసన చేస్తోన్న విపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించేశారు. వారిని అడ్డుకునేందుకు మార్షల్స్ ను ప్రవేశపెట్టారు రాజ్యసభ ఛైర్మన్.
అయితే పెద్ద ఎత్తున మార్షల్స్ ను తీసుకువచ్చి తమ ఆందోళనను అడ్డుకుంటున్నారని విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. పెద్ద ఎత్తున భద్రతను పెట్టుకుని ఇన్సూరెన్స్ బిల్లను కేంద్రం పాస్ చేయించిందని కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ అన్నారు.
అయితే ఈ ఆరోపణలను ఖండించిన కేంద్రం.. విపక్ష సభ్యులే మార్షల్స్ పై చేయిచేసుకున్నారని పేర్కొంది. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. విపక్షాలపై మండిపడ్డారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్ 11న ముగిశాయి. లోక్ సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా వేశారు. జులై 19న మొదలైన ఈ సమావేశాలు ఆగస్ట్ 13 వరకు కొనసాగించాలని ముందు నిర్ణయించారు.
ALSO READ:
Covid 19 Vaccine for Children: సెప్టెంబర్ నాటికి మార్కెట్ లోకి పిల్లల కరోనా వ్యాక్సిన్!