కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల ప్రక్రియ షురూ అయింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్/ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2021 (CU CET) నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సీయూ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు చేపట్టనుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (https://cuap.ac.in) కూడా ఉంది.
దీనికి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు సెప్టెంబర్ 1వ తేదీతో ముగియనుంది. దరఖాస్తు ఫీజులను సెప్టెంబర్ 2వ తేదీ వరకు చెల్లించవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు cucet.nta.nic.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
Also Read: EAPCET 2021 Exams: కోవిడ్ పాజిటివ్ విద్యార్థులకు నో ఎంట్రీ.. ఎల్లుండి నుంచి ఈఏపీసెట్
వచ్చే నెలలో పరీక్ష..
సీయూ సెట్ 2021 పరీక్షను సెప్టెంబర్ 15, 16, 23 మరియు 24 తేదీల్లో నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) సీయూ సెట్ పరీక్ష జరుగుతుంది. సీయూ సెట్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఇంగ్లిష్ భాషలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటలుగా (120 నిమిషాలు) ఉంది.
మనం ఎంచుకున్న యూనివర్సిటీ ఆధారంగా విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు తదితర వివరాలు మారుతుంటాయి. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు సదరు వర్సిటీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం cucet.nta.nic.in, nta.ac.in వెబ్ సైట్లను సంప్రదించవచ్చు.
Also Read: UPSC Exam Calendar: యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్.. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడంటే?
ఏయే యూనివర్సిటీల్లో ప్రవేశాలు?
సీయూ సెట్- 2021 ద్వారా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్, అస్సాం యూనివర్సిటీ సిల్చార్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హరియాణా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్తాన్, సౌత్ బిహార్ సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రవేశాలు పొందవచ్చు.
సీయూ సెట్ స్కోర్ ఆధారంగా..
సీయూ సెట్- 2021 ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేస్తుంది. ఆ తర్వాత సంబంధిత వర్సిటీలు కౌన్సెలింగ్/ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేస్తాయి. సీయూ సెట్ స్కోర్ ఆధారంగా వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో జరగనుందని ఎన్‌టీఏ ఒక ప్రకటనలో తెలిపింది.