హిమాలయాల్లో అరుదైన మొక్క..


హిమాలయాల్లో అరుదైన మొక్కను కనుగొన్నారు. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో యుట్రిక్యులారియా ఫర్సెల్లెటా (Utricularia Furcellata)
మొక్కను కనుగొన్నట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ అటవీ శాఖ, హిమాలయాల్లో అరుదుగా కనిపించే మొక్కలపై అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే చమోలి జిల్లాలోని పిక్చర్‌స్కూ మండల్ వ్యాలీలో కొన్ని రోజులుగా అధ్యయనం చేస్తున్నట్టు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజీవ్ చతుర్వేది తెలిపారు. ఉత్తరాఖండ్‌లోనే కాకుండా, మొత్తం పశ్చిమ హిమాలయాల్లోని ఈ మొక్క కనిపించటం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోతో కూడిన బృందం ఈ మొక్కను కనుగొన్నారు. మరో విశేషం ఏంటంటే ఈ అచీవ్‌మెంట్‌ని జర్నల్ ఆఫ్‌ జపనీస్ బాటనీలో ప్రచురించారు. 


కీటకాల్ని తినేసే మొక్క అది..


వృక్షశాస్త్రానికి సంబంధించిన అధ్యయనాలు, పరిశోధనలు ఈ పత్రిక 106 ఏళ్లుగా ప్రచురిస్తోంది. ఈ పత్రికలో పశ్చిమ హిమాలయ ప్రాంతంలో కనుగొన్న అరుదైన మొక్క గురించి రావటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. కీటకాలను తినే మొక్కలపై పరిశోధనల్లో భాగంగానే
ఈ మొక్కను కనుగొన్నట్టు తెలిపారు. కీటకాల్ని ఆకట్టుకునేందుకు ఈ మొక్కలో ప్రత్యేక నిర్మాణం ఉంటుందని, దోమల లార్వాలనూ ఈ మొక్క 
సులువుగా ఆకర్షించగలదగని అధికారులు చెబుతున్నారు. వాక్యూమ్‌ని క్రియేట్ చేసి, సులువుగా కీటకాలను లోపలకు లాక్కునేలా ప్రెజర్చే యటం ఈ మొక్కలో కనిపించే అరుదైన లక్షణం. అందుకే వీటిని మాంసాహార మొక్కలుగా పిలుస్తారు. మంచి నీరు, తడి నేలల్లో మాత్రమే ఈ మొక్క కనిపిస్తుందని, హిమాలయాల్లో కనిపించటం వింతగా ఉందని అంటున్నారు పరిశోధకులు. 


హిమాలయాల్లో ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలు..


ఇదే కాదు. గతంలోనూ ఇలాంటి మూలికల్ని, మొక్కల్ని కనుగొన్నారు. వీటిలో కొన్నింటిలో ఎన్నో ఔషధ లక్షణాలున్నవీ ఉన్నాయి. పర్వత సానువుల్లో తిరిగే చాలా మంది ఆ మొక్కలు, మూలికలు సేకరిస్తుంటారు. కంపెనీలకూ విక్రయిస్తుంటారు. వీటిని వినియోగించి ఫార్మా సంస్థలు మందులు తయారు చేస్తుంటాయి. ఎంతో అరుదైన ఫరాన్ మొక్కను రెండేళ్ల క్రితమే కనుగొన్నారు. ఉల్లిజాతికి చెందిన ఈ మొక్కలో బోలెడు ఔషధ గుణాలున్నాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఉత్తరాఖండ్‌లోనే ఆల్పైన్ పచ్చిక మైదానాల్లో ఫరాన్ మొక్కలు పుష్కలంగా 
లభిస్తాయని వెల్లడించారు. మరో విశేషం ఏంటంటే ఈ ఫరాన్ మొక్కల్ని సాగు చేస్తారు. వీటిలో డయాబెటిన్‌ను కట్టడి చేసే ఔషధ గుణాలున్నాయట. ఈ మొక్కలో 100 రకాలున్నాయనీ వృక్షశాస్త్ర పరిశోధకులు అంటున్నారు. ఈ నేలలోని మట్టి వల్ల ఆ మొక్కలకు అన్ని గుణాలు వస్తాయని, వాతావరణం ఆధారంగా రుచి కూడా మారుతుందని  వివరిస్తున్నారు.