TDP Leader Prathipati Pulla Rao About Alliance: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్‌గా వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనుంది. తమకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని, తమ నేత వైఎస్ జగన్ సంక్షేమ పాలనకు ఓట్లు పడతాయని ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పలు సందర్బాలలో ప్రస్తావించారు. అయితే పొత్తుల అంశంపై మాట్లాడుతూ మాజీ మంత్రి, ఏపీ టీడీపీ ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ పొత్తు లేకపోయినా 160 సీట్లు గెలిచే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. అమరావతి రాజధాని అభివృద్ధి చేయకుండా భూములను అమ్ముకునే అధికారం సీఎం జగన్ మోహన్ రెడ్డికికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. 


సీఎం జగన్ చేతగాని పనులు, చెత్త పరిపాలనకు ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మూడు సంవత్సరాల వైఎస్సార్ సీపీ పాలన కేవలం విధ్వంసాలు, అరాచకాలు, కూల్చివేతలకే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎకరా రూ 10 కోట్లకి అమ్మాలని భావిస్తే.. మీ దుర్మార్గానికి ఎవరు ముందుకు వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అభివృద్ధి చేయకుండా అమ్ముకునే అధికారం సీఎం జగన్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అధికార పార్టీ ప్లీనరీలకు ఆ పార్టీ నేతలే ముఖం చాటేస్తుండగా.. చంద్రబాబు, లోకేష్ పర్యటనలకు రాష్ట్రంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.


వెన్నెముక లేని సీఎం జగన్
వెన్నెముక లేని సీఎంగా జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, ప్రపంచంలోనూ పేరు తెచ్చుకున్నారంటూ మాజీ మంత్రి ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టించిన టిడ్కో ఇల్లు పేద ప్రజలకు ఇవ్వలేదు. కనీసం ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న నివాస స్థలాల్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో భూసేకరణలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలందరికీ తెలుసునన్నారు. విషపూరిత హానికరమైన మూడు రకాల మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తూ పేదవాడి ప్రాణాలను బలిగొంటున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యంతో ఖజానా నింపుకోవాలని దురాలోచన ఇప్పటికైనా ఆపాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.


మెడలు వంచుతానని.. ఢిల్లీలో మోకరిల్లారు 
రాష్ట్రంలో మొత్తం తమ పార్టీ ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీ పెద్దల మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన సీఎం జగన్.. అధికారంలోకి రాగానే తన కేసుల మాఫీ కోసం కేంద్రం పెద్దల ముందు మోకరిల్లడం సిగ్గుచేటు అంటూ ప్రతిపాటి పుల్లారావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిన సీఎం జగన్‌కు.. టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే అర్హత కోల్పోయారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.