Ragging at JNTU Kakinada: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను సైతం ర్యాగింగ్ భూతం వదలడం లేదు. ఎన్నో కలలు, ఆశలతో కాలేజీలకు వస్తున్న విద్యార్థులకు సీనియర్ల నుంచి సమస్యలు తప్పడం లేదు. కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలు లాంటి ఘటనలు సైతం జరుగుతున్నాయి. తాజాగా కాకినాడ జేఎన్‌టీయూలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఇంటరాక్షన్ పేరుతో జూనియర్లను వేధించిన 11 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ మీడియాకు తెలిపారు.


సెకండియర్, థర్డ్ ఇయర్ విద్యార్థులు కాకినాడ జేఎన్‌టీయూ హాస్టల్‌లో జూనియర్లను వేధించారు. ఇంటరాక్షన్ పేరుతో ఫస్టియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. మొదటి సంవత్సరం పెట్రోకెమికల్ విద్యార్థిని, ఇద్దరు సెకండియర్ స్టూడెంట్స్, 9 మంది థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కలిసి ర్యాగింగ్ చేయడం కలకలం రేపింది. దీన్ని ఇలా వదిలిపెట్టకూడదని, ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి స్నేహితుడు యూజీసీ యాంటీ ర్యాగింగ్ వెబ్‌సైట్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై వర్సిటీ యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది..


సీనియర్లపై కఠిన చర్యలు..
ర్యాగింగ్ జరిగిందని నిర్ధారించుకున్న యాంటీ ర్యాగింగ్ కమిటీ నివేదికను ప్రిన్సిపాల్‌కు అందించింది. దీనిపై స్పందించిన వైస్ ఛాన్స్‌లర్ సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. విచారణ తర్వాత మొత్తం 11 మందిని హాస్టల్ నుంచి రెండు నెలల పాటు.. తరగతులకు హాజరు కాకుండా కాలేజీ నుంచి 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. అకాడమిక్ పరంగా శ్రద్ధ వహించాలని, ర్యాగింగ్ లాంటి విషయాలను పక్కనపెట్టి మంచి విషయాలపై ఫోకస్ చేయాలని విద్యార్థులకు సూచించినట్లు చెప్పారు. తమ వర్సిటీ ర్యాగింగ్ లాంటి విద్యార్థులను ఇబ్బంది పెట్టే వాటిని సహించదని, బాధిత విద్యార్థులు ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.


ఆ జేఎన్‌టీయూలోనూ ఇలాంటి ఘటనే..
అనంతరం జిల్లాలో కొన్ని నెలల కిందట ర్యాగింగ్ భూతం వెలుగుచూసింది. జేఎన్టీయూ కళాశాల హాస్టల్ ర్యాగింగ్ కలకలం రేపుతోంది. సీనియర్ విద్యార్థుల హాస్టల్ కు జూనియర్ విద్యార్థులను పిలిపించుకొని అర్ధరాత్రి వరకు జూనియర్ విద్యార్తులతో అర్ధనగ్న డ్యాన్సులు చేయించినట్లు తెలుస్తోంది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తాళలేక జూనియర్ విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ చేసిన 18 మంది సీనియర్ విద్యార్థులను ప్రిన్సిపాల్ సుజాత సస్పెండ్ చేశారు. మూడు రోజుల తరువాత ర్యాగింగ్ గురించి తెలిసి చర్యలు చేపట్టారు.   


ఒకరిద్దరూ జూనియర్ విద్యార్థులు కనిపించలేదని వార్డెన్లు చెప్పారని ర్యాగింగ్ ఘటనపై జేఎన్‌టీయూ అనంతపురం ప్రిన్సిపాల్ సుజాత తెలిపారు. ‘వాళ్ల కోసం హాస్టల్లో చూశాం. ఎక్కడా కనిపించేదు. సీనియర్ విద్యార్థుల హాస్టల్లో కూడా లేరు. కానీ రాత్రి 10 గంటల తర్వాత విద్యార్థులు తిరిగి హాస్టల్ కి వచ్చారు. ఈ ఘటనపై విచారణకు ఓ కమిటీ వేశాం. ఆ కమిటీలో విద్యార్థులు నిజంగా ర్యాగింగ్ చేశారా లేదా అనేది తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు జూనియర్లతో మాట్లాడడానికి సీనియర్లు పిలిచారని అంటున్నారు. అది కూడా సరికాదు. అందుకు ఓ 18 మంది విద్యార్థులను గుర్తించాం. వాళ్లను సస్పెండ్ చేశామని’ ప్రిన్సిపాల్ సుజాత పేర్కొన్నారు.