Ramcharitmanas:


ఆగ్రహం ఎందుకంటే..


రామ్‌చరిత్ మానస్ గ్రంథంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సింగ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని మహంత్ జగద్గురు పరమహంస ఆచార్య డిమాండ్ చేశారు. ఆ గ్రంథం దేశంలో విద్వేషాలను వ్యాప్తి చేస్తోందన్న మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంతే కాదు. ఆ మంత్రి నాలుకను కోసిన వారికి రూ.10 కోట్ల బహుమానం కూడా ఇస్తానని ప్రకటించారు. సనాతన ధర్మాన్ని ఆచరించే వారిని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా ఆ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది జరగకపోతే...ఆయన నాలుక కోసిన వారికి బహుమానం ఇస్తానని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల్ని ఏ మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. రామ్‌చరిత్ మానస్ గ్రంథం...అందరినీ ఏకం చేసేదే తప్ప విడదీసేది కాదని తేల్చి చెప్పారు. అదో గొప్ప మానవతా గ్రంథమని
కితాబునిచ్చారు. భారతదేశ సంస్కృతికి ఆ గ్రంథమే నిదర్శనమని, ఇది దేశం గర్వించాల్సిన గ్రంథమని చెప్పారు. 










ఇదీ జరిగింది..


నలందా ఓపెన్ యూనివర్సిటీలో బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ...రామ్ చరిత్ మానస్, మనుస్మృతి లాంటి గ్రంథాలు సమాజాన్ని చీల్చేస్తాయని, విద్వేషాలు వ్యాప్తి చేస్తాయని అన్నారు. అందుకే మనుస్మృతిని కాల్చేశారని చెప్పారు. వెనకబడిన వర్గాలకు విద్య అందించడాన్ని వ్యతిరేకించారని  విమర్శించారు. "పాలు తాగాక పాము మనపైనే ఎలా విషం కక్కుతుందో...అలాగే వెనకబడిన వర్గాలు చదువుకుంటే మనపై తిరగబడతారని రామ్‌చరిత్ మానస్‌లో రాశారు" అని చేసిన వ్యాఖ్యలే ఇంత వివాదానికి కారణమయ్యాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో మంత్రి మాట్లాడిన వీడియోలు షేర్ చేస్తూ తీవ్రంగా మండి పడుతున్నారు ఓ వర్గం వాళ్లు. అయితే...ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచైతే దీనిపై ఎలాంటి వివరణ రాలేదు. 


Also Read: DIP Notice To AAP: కేజ్రీవాల్‌కు మరో షాక్, పదిరోజుల్లోగా ఆ డబ్బు చెల్లించాలని నోటీసులు