DIP Issues Notice to AAP:


డీఐపీ నోటీసులు..


ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP)కి డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (DIP) నోటీసులు ఇచ్చింది. 10 రోజుల్లోగా రూ.164 కోట్లు కట్టాలని ఆదేశించింది. ప్రభుత్వ ప్రకటనల పేరు చెప్పి పార్టీ ప్రకటనలు ఇచ్చారంటూ..ఈ మేరకు ఆప్‌ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు 
పంపింది. ఇప్పటికే గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వినాక్ కుమార్ సక్సేనా చీఫ్ సెక్రటరీకి ఈ విషయమై ఆదేశాలిచ్చారు. ఆప్‌  నుంచి రూ.97 కోట్లు రికవరీ చేయాలని తేల్చి చెప్పారు. 2015-16 మధ్య కాలంలో ప్రభుత్వ ప్రకటనల ముసుగులో రాజకీయ ప్రకటనలు
ఇచ్చినందుకు ఈ మొత్తం చెల్లించాలని వెల్లడించారు. దీనిపై ఆప్ స్పందించింది. ఢిల్లీ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడానికి బీజేపీ అన్ని విధాలా ప్రయత్నిస్తోందని మండి పడుతోంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇదే విధంగా యాడ్స్ ఇస్తున్నప్పుడు ఢిల్లీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. ఇటీవలే లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌తో అత్యవసర సమావేశం అవ్వాలని కేజ్రీవాల్ప్ర యత్నించినా అందుకు అనుమతి లభించలేదు. అయితే...లెఫ్ట్‌నెంట్ గవర్నరే స్వయంగా కేజ్రీవాల్‌ను పిలిచి చర్చించాలని చెప్పినా...మళ్లీ ఆయనే అందుకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యాడ్స్ విషయంలో వచ్చిన నోటీసులను కూడా పట్టించుకోవడం లేదు. ఇటీవలే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించింది ఆప్. ఆ వెంటనే ఇలా నోటీసులు ఇవ్వడం రాజకీయ వేడినీ పెంచుతోంది. కేవలం బీజేపీ చెప్పినట్టుగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నడుచుకుంటున్నారని ఆప్ ఆరోపిస్తోంది. అంతే కాదు. బీజేపీ కూడా వేల కోట్ల రూపాయలు ప్రకటనల కోసం ఖర్చు చేసిందని, వాటిని తిరిగి ఇస్తే తామూ తిరిగి ఇస్తామని తేల్చి చెప్పింది. 


మేయర్‌ విషయంలోనూ గొడవే..


ఢిల్లీ మేయర్ నియామకం విషయంలో పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది. సివిక్ సెంటర్‌లో బీజేపీ, ఆప్ మధ్య ఇటీవలే ఘర్షణ జరిగింది. ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఈ క్రమంలో తోపులాట కూడా జరిగింది. ప్రోటెమ్ స్పీకర్‌గా ఆప్ అభ్యర్థి ముఖేశ్ గోయల్‌ను కాదని బీజేపీకి చెందిన సత్య శర్మను ఎలా నియమిస్తారంటూ ఆప్ గొడవకు దిగింది. ఎలాగోలా సత్య శర్మ ప్రమాణ స్వీకారం చేసినా...ఆ తరవాతే మళ్లీ గొడవ మొదలైంది. ఎన్నికైన కౌన్సిలర్‌లను కాకుండా ముందుగా నామినేటెడ్ కౌన్సిలర్లను ప్రమాణ స్వీకారం చేయాలని పిలవడంపై ఆప్  తీవ్రంగా మండి పడింది. "ఇది అనైతికం" అంటూ విరుచుకు పడింది. ఈ కారణంగా...మేయర్‌ ఎన్నిక కోసం జరగాల్సిన ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై బీజేపీ స్పందించింది. "ఆప్ ఎందుకు భయపడుతోంది. నైతికంగా ఆ పార్టీ ఓడిపోయింది. వాళ్ల కౌన్సిలర్లే వాళ్లకు సపోర్ట్ ఇవ్వరు అని ఆ పార్టీ భావిస్తోంది" అని విమర్శించారు బీజేపీ ఎంపీ మనోజ్ తివారి. అటు ఆప్ కౌన్సిలర్లు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.  "నామినేటెడ్ కౌన్సిలర్లను పిలిచి ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిని మేం వ్యతిరేకించాం.  గొడవ అంతా అప్పుడే మొదలైంది. ఎన్నికైన కౌన్సిలర్లే ముందుగా ప్రమాణ స్వీకారం చేయాలని పట్టుబట్టాం. బీజేపీయే కావాలని ఇలా చేసింది" అని మండి పడ్డారు.


Also Read: UPI for Fund Transfer: దేశాలు దాటుతున్న యూపీఐ - త్వరలో మరో 10 దేశాల్లో!