నేడు సీఎం మహబూబాబాద్ పర్యటన
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నరకు ప్రగతి భవన్‌లో బయల్దేరి మహబూబాబాద్ చేరుకుంటారు. అక్కడ పది గంటలకు బీఆర్‌ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 11గంటలకు మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రారంభిస్తారు. 11.30కు కలెక్టరేట్ ఆవరణలో జరిగే ప్రజాప్రతినిధుల సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. 1.30కు భద్రాద్రి కొత్తగూడెం చేరుకుంటారు. 1.55కి కొత్తగూడెం సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. మూడు గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 3.20కి బీఆర్‌ఎస్ నూతన కార్యాలయం ప్రారంభిస్తారు 4.30- హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్ తిరుగు ప్రయాణం
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
రెండు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్ నేతృత్వంలో రెండ్రోజుల ముందు నుంచే మహబూబాబాద్‌ను అష్టదిగ్బంధనం చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముగ్గురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, 17 మంది డీఎస్పీలు, 63 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, 160 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లతో పాటు 1600 మంది పోలీసులు ఈ భద్రత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వాహన తనిఖీలు ముమ్మరం చేయడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో కలెక్టరేట్, పార్కింగ్ స్థలాలు, హెలిప్యాడ్ తదితర ప్రాంతాల్లో పూర్తిస్థాయి నిఘా ఉంచారు.
నేడూ థాక్రే సమావేశాలు
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్ థాక్రే ఇవాళ కూడా కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. నిన్న కొందరి సీనియర్‌లతో సమావేశమై పార్టీ స్థితిగతులు తెలుసుకున్నారు. ఇవాళ మరికొందరితో భేటీ కానున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్‌లో ఛార్జ్ తీసుకోనున్న సోమేశ్‌కుమార్
కోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లిన తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ ఇవాళ ఏపీలో ఛార్జ్ తీసుకోనున్నారు. ముందుగా సీఎం జగన్ తో సమావేశమై చర్చించిన అనంతరం ఆయన ఛార్జ్ తీసుకుంటారు.