Surya Tilak on Ram Lalla Forehead: అయోధ్య రామ మందిరంలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. రామ నవమి సందర్భంగా బాల రాముడి నుదుటిపై సూర్యతిలకం దర్శనం ఇచ్చింది. సూర్య కిరణాలు మూలవిరాట్‌ని తాకేలా ట్రస్ట్ ఇలా ఏర్పాట్లు చేసింది. దాదాపు 3-4 నిముషాల పాటు ఈ తిలకం భక్తులకు కనువిందు చేసింది. అయోధ్య ఆలయ నిర్మాణం పూర్తైన తరవాత జరుగుతున్న తొలి శ్రీరామ నవమి వేడుకలు ఇవి. అందుకే అత్యంత వైభవంగా ఈ పండుగను జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. నిజానికి వచ్చే ఏడాది శ్రీరామ నవమికి ఈ సూర్య తిలక దర్శనం ఉంటుందని చెప్పింది. కానీ...ఆ తరవాత ఈ ఏడాదే ఇది ఉంటుందని ప్రకటించింది. 58 మిల్లీ మీటర్ల పరిమాణంలో సూర్య కిరణాలు బాల రాముడి నుదుటిపై ప్రసరించాయి. ఆ సమయంలో ఆలయం అంతా జై శ్రీరామ్ నినాదాలతో మారు మోగింది.
ఎలా సాధ్యమైంది..?
ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడం వెనక ఎంతో శ్రమ ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పరికరాన్ని తయారు చేశారు. దేశంలో ఎంతో పేరొందిన 10 మంది శాస్త్రవేత్తల కృషి ఇది. రామ నవమి రోజున ఎలాంటి అవాంతరం రాకుండా ఈ సూర్య తిలకం అందరికీ దర్శనమివ్వాలని సంకల్పంతో పని చేశారు. అందుకోసం అద్దాలు, లెన్స్‌ని ఏర్పాటు చేశారు. చెప్పడానికి సులువుగానే ఉన్నా...సరిగ్గా ఆ సమయానికి అక్కడ కిరణాలు పడేలా చేసేందుకు చాలానే స్టడీ చేశారు. ఈ మొత్తం ప్రక్రియకి Surya Tilak Mechanism అనే పేరు పెట్టారు. సైంటిఫిక్‌గా చెప్పాలంటే... opto-mechanical system ద్వారా ఈ అరుదైన ఘట్టాన్ని అందరి ముందు ఉంచారు.
పైప్‌లలో నాలుగు అద్దాలు, నాలుగు లెన్స్ అమర్చారు. వాటిని వాలుగా (Tilt System) ఏర్పాటు చేశారు. ఈ మొత్తం సిస్టమ్‌ని ఆలయంపైన అమర్చారు. సూర్య కిరణాలు పైన అద్దాలలో పడి అవి నేరుగా బాల రాముడి నుదుటిపై పడేలా ఏర్పాట్లు చేశారు. బాల రాముడి ముఖం తూర్పువైపు ఉంటుంది. అయితే...ఆలయ శిఖరాన ఏర్పాటు చేసిన మొదటి అద్దాన్ని అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇదే టిల్ట్ సిస్టమ్. ఆ అద్దం మీదుగా సూర్య కిరణాలు ఉత్తర దిశగా ప్రసరిస్తాయి. ఇక చివరిగా ఉన్న అద్దం,లెన్స్ ఈ సూర్య కిరణాలను గ్రహించి సరిగ్గా రాముడి నుదుటిపై పడేలా చేస్తాయి. ఇందులోని పైప్‌లు ఎక్కువ రోజుల పాటు మన్నికగా ఉండేలా ఇత్తడితో తయారు చేశారు. మూడో అంతస్తు నుంచి గర్భాలయంలోని రాముడి విగ్రహంపై పడేలా ఇలా ప్రత్యేకంగా ఓ వ్యవస్థనే సృష్టించారు. బెంగళూరుకి చెందిన ఓ కంపెనీ ఇందుకు టెక్నికల్ సపోర్ట్ అందించింది. ప్రతి రామనవమికి ఇలా సూర్య తిలకం దర్శనం ఇవ్వనుంది.
Also Read: Dubai Floods: ఎడారి నగరం దుబాయ్‌లో వరదలు ఎందుకొచ్చాయి? ఇవి కృత్రిమ వర్షాలా?