Floods in Dubai: ఎడారి దేశంలోని దుబాయ్ సిటీలో వరదలు రావడం (Floods in Dubai) ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వీధులన్నీ నీట మునిగాయి. వాహనాలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. హైవేలు, ఎయిర్‌పోర్ట్‌లు...ఇలా ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఫ్లైట్ సర్వీస్‌లకు అంతరాయం కలుగుతోంది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కేవలం 24 గంటల్లోనే నమోదైందని (Rainfall in Dubai) అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే...ఎంత కుండపోత వాన కురిసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 15వ తేదీ తరవాత మొదలు కాగా ఆ రోజు వర్షపాతం 20 మిల్లీమీటర్లుగా నమోదైంది. మరుసటి రోజు మరింత ఉద్ధృతమైంది. దాదాపు 142 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇప్పటికే యూఏఈ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ (Dubai Floods) బయటకు రావద్దని తేల్చి చెప్పింది. ఉద్యోగులందరూ ఎవరి ఇళ్లలో వాళ్లు పని చేసుకోవాలని సూచించింది. అయితే...అసలు వర్షం జాడే ఉండని దుబాయ్‌లో ఈస్థాయిలో వానలు ఎందుకు కురిశాయనేదే ఆసక్తికరంగా మారింది. CNN వెల్లడించిన వివరాల ప్రకారం తుఫాను కారణంగానే ఇక్కడ ఇంత భారీ వర్షాలు పడుతున్నాయి. అరేబియన్ భూభాగం మీదుగా గల్ఫ్ వైపుగా దూసుకొస్తోంది ఈ తుఫాన్. అటు ఒమన్‌లోనూ తేమ వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్‌లోనూ స్వల్ప ప్రభావం కనిపిస్తోంది. ఒమన్‌లో వరదల కారణంగా ఇప్పటి వరకూ 18 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి మీడియా వెల్లడించింది.
వాతావరణ మార్పులు ఇలా ప్రభావం చూపిస్తున్నాయని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. భూతాపమూ ఈ అసాధారణ వర్షాలకు కారణమని వివరిస్తున్నారు. ఇది కచ్చితంగా మానవ తప్పిదం వల్ల కురుస్తున్న భారీ వర్షాలే అని స్పష్టం చేస్తున్నారు. అయితే...Bloomberg మరో విషయాన్ని వెల్లడించింది. UAE ఎప్పటి నుంచో Cloud Seeding చేస్తోందని, ఆ ఫలితమే ఇప్పుడు ఇలా కనిపిస్తోందని చెబుతోంది. 2022 నుంచే యూఏఈ ఈ క్లౌడ్ సీడింగ్ చేపడుతోంది. నీటిని కాపాడుకునేందుకు ఇలా చేస్తోంది. వాతావరణంలోకి పొటాషియం క్లోరైడ్ లాంటి నాచురల్ సాల్ట్‌ని పెద్ద మొత్తంలో ఇంప్లాంట్ చేస్తారు. ఈ కారణంగా మేఘాలు కరిగిపోయి భారీ వర్షాలు కురుస్తాయి. 1982లోనే యూఏఈ ఈ క్లౌడ్ సీడింగ్‌ని ప్రయోగించింది. ఆ తరవాత గల్ఫ్ దేశాలు ఈ కృత్రిమ వర్షాల కాన్సెప్ట్‌పై దృష్టి పెట్టాయి. ఇందుకోసం యూఏఈలో వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకున్నారు అక్కడి సైంటిస్ట్‌లు. మేఘాల పరిమాణాన్ని పెంచడంతో పాటు వాటిని కరిగిపోయేలా ఎలా చేయొచ్చో అధ్యయనం చేశారు. అందుకోసం ప్రత్యేకంగా విమానాల ద్వారా కెమికల్స్ పంపారు. కొన్ని మేఘాల వరకూ వెళ్లి అక్కడ ఆ కెమికల్స్‌ని చల్లేవారు. అయితే...ఇలాంటి కృత్రిమ వర్షాల వల్ల నష్టం తప్పదని కొందరు పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇందులో సేఫ్‌టీ ఎంత ఉందో కూడా చూసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి దుబాయ్‌లో మాత్రం వరదలు ముంచెత్తి అందరినీ భయ పెడుతున్నాయి.