Israel Iran War Highlights - ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడులకు యూదుల ప్రతిస్పందన ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ మిలటరీ కమాండర్లు చనిపోవడంతో ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులు చేసిన విషయం తెలిసిందే. 300 డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ చేసిన పరిమిత దాడిని ఇజ్రాయెల్ అమెరికా, జోర్డాన్ సహా ఇతర మిత్రదేశాలతో అడ్డుకుంది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకకుండానే గాల్లోనే పెల్చి వేసింది. పెద్ద ఆస్థి నష్టం గాని, ప్రాణ నష్టం గాని సంభవించకుండానే ఇజ్రాయెల్ బయటపడింది. 
అయితే ఇరాన్ దాడికి తగిన రీతిలో, తగిన సమయంలో బుద్ది చెబుతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యహూ  ప్రకటించడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వెంటనే దాడి చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించినా, అమెరికా అడ్డు చెప్పడంతో కొంత సంయమనం పాఠిస్తున్నట్లు అంతర్జాతీయ వార్తలు చెబుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఎటాక్ చేసే పద్ధతులు తెలిసిన మిలటరీ నిపుణులు మాత్రం. ఇరాన్ కు గట్టిగానే యూదులు బుద్ది చెప్పడం ఖాయమని కాని అది ఎలా ఎప్పుడు చెబుతారో.. ఆ తర్వాత ప్రపంచ పరిణాలు ఎలా మారనున్నాయో తెలియదని ఆందోళన చెందుతున్నారు. 
పంటికి పన్ను... కంటికి కన్ను సిద్ధాంతం యూదులది
కంటికి కన్ను.. పంటికి పన్ను... అనే సిద్ధాంతాన్ని ఇజ్రెయెల్ పవిత్ర గ్రంధంమైన తోరా  చెబుతుంది. అందుకే తమ మీద దాడి చేసే ఆలోచన చేస్తున్నారని తెలిసినా.. ఇజ్రాయెల్ మిలటరీ చూస్తూ ఊర్కోదు.  ఏదైనా దేశంలో తమ దేశంపై కుట్రలు జరుగుతుందని తెలిస్తే చాలు.. చటుక్కున అక్కడ వాలిపోతారు ఆ దేశానికి చెందిన గూఢాచారి సంస్త మోస్సాద్  ఎజెంట్స్.  కొంచెం అనుమానం వచ్చినా చాలు.. ఆ కుట్రను చేధించి.. అందుకు కారకులైన వారిని మూడో కంటికి తెలియకుండా మట్టుపెడతారు. అందు కోసం ఎంతకైనా తెగిస్తారు.  అందుకే ప్రపంచ  ఇంటలిజెన్స్ ఎజెన్సీల్లో  మొస్సాద్ పేరు చెబితే హడల్. ప్రపంచంలో ఎప్పుడైనా.. ఎక్కడైనా ఓ వీఐపీ కాని,  ఓ అణు శాస్త్రవేత్త గాని తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటే చాలు.. చాలా చాకచక్యంగా ఎంత కట్టుదిట్టమైన భద్రతనైనా చేధించి... తమ పని కానిచ్చేస్తారు. ఏ  ఆధారాలు లేకుండా చనిపోయిన చాలా మంది హత్యల వెనుక  మొస్సాద్ హస్తం ఉందన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఎప్పుడూ కూడా  ఇజ్రెయెల్ ప్రభుత్వం సైలంట్ ఆపరేషన్ తాము చేసామని ఎప్పుడూ బయటపెట్టదు. అది అన్ నోన్ హిస్టరీగానే మిగిలిపోతుంది


స్మార్ట్ ఆపరేషన్స్ కు మొస్సాద్..  ఇజ్రాయెల్ ఫోర్సెస్ ప్రసిద్ధి
మొస్సాద్ ఎజెన్సీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆపరేషన్స్ గమనిస్తే.. వాళ్లు ఎంత పకడ్బందీగా, చాకచక్యంతో తమ పని కానిచ్చేస్తారో  చూస్తే ఆశ్చర్యం రాక మానదు. జేమ్స్ బాండ్007 సినిమాలు కూడా వారి ముంద దిగదుడుపే అని చెప్పాలి. మొస్సాద్ ఆపరేషన్స్ పై హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయంటే  టార్గెట్ ను  ఎంత క్లీన్ ప్యాట్రన్ లో సఫా చేస్తారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. మొస్సాద్ తో కలిసి ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్స్ విషయానికి వస్తే..


ఆపరేషన్ ఫినాలే
జర్మనీలో యూదుల ఊచకోతకు సంబంధి నాజీ నేత అడాల్ఫ్ ఐచ్ మాన్ కిడ్నాప్  అన్నది ఓ సన్సేషన్.  హలీవుడ్ సినిమాకు తీసిపోని రీతిలో ఈ ఆపరేషన్ జరిగింది. రెండ ప్రపంచ యుద్దం ముందు జర్మనీలో లక్షలాది యూదులను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో ఉంచి చంపిన చరిత్ర అడాల్ఫ్ హిట్లర్ హయాంలో జరిగింది. దీనికి సహకరించిన నేతలను రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ టార్గెట్  చేసింది.1960లలో అలాంటి నాజీ నేత  అడాల్ఫ్ ఐచ్ మాన్ అర్జంటైనాలో ఉన్నట్లు సమాచారం అందడంతో  ఇజ్రాయెల్ తన ఏజెంట్లను అక్కడికి పంపింది.  అక్కడ నివాసం ఉంటున్న ఐచ్ మాన్ ను గుర్తించి,  ఆర్జంటైనా ప్రభుత్వానికి తెలియకుండా  చాలా స్మార్ట్ గా  ఆయన్ను కిడ్నాప్ చేసి ఇజ్రాయెల్ కు తరలించింది. ఈ సీక్రెట్ఆపరేషన్ కు అన్ని దేశాలకు షాక్ నిచ్చినట్లయింది. యూదుల హత్యపై అతన్ని న్యాయస్థానంలో విచారించి ఉరిశిక్ష విధించింది ఇజ్రెయెల్.


ఆపరేషన్ ఎంటబే.... 
ఇజ్రాయెల్ నిర్వహించిన ఆపరేషన్ ఎంటబే... హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉంటుంది. 1976 లో ఎయిర్ ఫ్రాన్స్ కు చెందిన  విమానాన్ని పాపులర్  ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా ఎక్స్ టర్నల్ ఆపరేషన్స్ అనే  ఉగ్రవాద సంస్థ హైజాక్ చేసి ఉగండాకు తరలించింది.  అందులో ఇజ్రాయెల్ కు చెందిన వారితో పాటు 240 మంది  ప్రయాణికులను బందీలుగా చేసుకుని ఇజ్రాయెల్ లో ఉన్న తమ సంస్థకు చెందిన ఖైదీలను విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఇజ్రాయెల్ గవర్నమెంట్ అక్కడికి వంద మంది కమాండోలను విడిపించడానికి పంపింది.  అర్థ రాత్రి  ఇజ్రాయెల్ రవాణా విమానంలో  చేరుకున్న కమాండోలు ఆ తీవ్రవాదులపై దాడి చేసి  బందీలను విడిపించారు. వారికి మద్ధతుగా ఉన్న ఉగాండా సైనికులను మట్టుబెట్టారు.  ఆ దేశానికి చెందిన 11 మిగ్ విమానాలను ధ్వంసం చేసి  బందీలను విడుదల ఇజ్రాయెల్ కు తోడ్కోని రావడం అప్పట్లో  ఓ  గొప్ప ఆపరేషన్ గా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆపరేషన్ కు  కమాండ్ ఇన్ చీఫ్ ఎవరంటే.. ప్రస్తుత ప్రధాని బెంజిమన్ నెతాన్యూహు అన్న యోనాతాన్ నెతాన్యూహు కావడం విశేషం. ఈ ఆపరేషన్ పై అనేక హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లు,  డాక్యుమెంటరీలు రూపొందాయి.


ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్
1973 సెప్టెంబర్ లో మ్యూనిచ్ ( జర్మనీ) ఒలంపిక్స్ లో పాల్గొన్న యూదు క్రీడాకారులు, కోచ్ లపై పాలస్తీనా తీవ్రవాదులు దాడి చేసి 11 మందిని చంపారు.  ఈ  ఉగ్రవాద చర్యకు మాస్టర్ మైండ్స్ అయిన అందరినీ చంపాలని  ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్  ప్రారంభమైంది. ఇందులో పాల్గొన్న ఉగ్రవాదులను వెతికి వెటాడి మరీ  ఆయా దేశాల్లో తలదాచుకున్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి ఒక్కోక్కరిగా మట్టుబెట్టింది. ఇప్పటి వరకు ఈ హత్యలు ఎవరు చేశారన్నది ప్రపంచానికి తెలియకపోయినా.. మొస్సాద్ ఆపరేషన్ గా అందరికీ సుపరిచితమే.
 
ఇరాన్ అణు కార్యక్రమం మీద లాంగ్ ఆపరేషన్
ఇరాన్ తో సంబంధాలు చెడిపోవడంతో ఇజ్రాయెల్ ఇరాన్ పై మిలటరీ కార్యక్రమాలపై కన్నెసింది. ఎప్పుడైనా ఇరాన్ తమపై దాడికి దిగవచ్చన్న అనుమానంతో నిరంతరం నిఘా పెట్టింది.  ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తుందన్న సమాచారం అదండంతో 2010 నుండి  2021 వరకు  ఆ అణు ప్రాజెక్టులు ముందుకు సాగకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది.  ఇరాన్  అణు ప్రాజెక్టుకు సంబంధించిన నలుగురు శాస్త్రవేత్తల హత్య జరిగింది. అందులో ఇద్దరిని మోటార్ సైకిల్ పై వచ్చిన అగంతకులు కాల్చి చంపగా, మరో ఇద్దరిని పేలుడు పదార్థాలను వారు ప్రయాణించే కారుకు అమర్చి  పెల్చివేసి చంపారు. వారితో పాట మరి కొద్ది మంది శాస్త్రవేత్తలు కూడా కాల్పులకు గురయ్యారు. అంతే కాకుండా అణు కేంద్రంలో వాడే సెంట్రీ ఫ్యూజులు నాణ్యత లేనివి ఇరాన్  కు  తమకు అనుకూల కంపెనీల ద్వారా విక్రయించేలా చేసి ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్టు ముందుకు సాగకుండా దెబ్బ తీసింది. ఈ హత్యలపై ఇజ్రాయెల్ పై ఇరాన్ ఆరోపణలు చేసినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ఎప్పడూ దీనిపై నోరు విప్పలేదు.
 
ఆపరేషన్ ఓపెరా..
ఇరాక్ అణు కార్యక్రమాన్ని కూడా  ఇజ్రాయెల్ ఆపరేషన్ ఓపెరా ద్వారా అడ్డుకుంది. 1981 లలో శాంతియుత ప్రయోజనాల పేరుతో  ఫ్రాన్స్ నుండి ఇరాక్  అణు రియాక్టర్ ను కొనుగోలు చేసింది. దీంతో తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని భావించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం 1981 జూన్ 7వ తేదీన  వైమానికి దాడి జరిపించి ఆ  రియాక్టర్ కు నష్టం కలగజేసి  న్యూక్లియర్ ప్రోగ్రాం అడ్డుకుంది.  ఈ చర్య ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. ఈ దాడిలో కొందరు ఇరాకీ సైనికులు, ఫ్రెంచ్ పౌరుడు చనిపోయారు. 
 
ఇరాన్ పై ప్రతి దాడి తప్పదా....?
ఇజ్రాయెల్ తనకు ప్రమాదం ఉందని తెలిసి చేసిన ఆపరేషన్లు చాలా ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే. పాలస్తీనా తీవ్రవాదులు  దాడి చేసినందుకే  ఇజ్రాయెల్ ప్రతి దాడిలో 30 వేల మంది చనిపోయినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ చేసిన దాడికి కూడా తప్పనిసరిగా ఇజ్రెయెల్ ప్రతిస్పందిస్తుదని అంతర్జాతీయ మిలటరీ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే  ప్రతి దాడి తప్పదని దీని కోసం ఆపరేషన ఐరన్ షీల్డ్ చేపట్టనున్నట్లు  ఇజ్రాయెల్ మిలటరీ ఫోర్సెస్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్  హెర్జి హలెవి ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు గట్టిగా ఇరాన్ కు సమాధానం చెప్పకపోతే తాము చులకన అవుతామన్న భావనలో ఇజ్రెయెల్ ఉన్నట్లు  అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 


తమపై జరిగిన దాడికి ప్రతిస్పందించే అధికారం  ఇజ్రాయెల్ కు ఉందని అమెరికా చెప్పడం కూడా  ప్రతి దాడి చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తిరిగి ఇజ్రాయెల్  దాడికి దిగితే తాము కూడా అదే స్థాయిలో సమాధానం ఇవ్వనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో మిడిల్ ఈస్ట్ లో  టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్ తో వ్యవహారం తెలే వరకు గాజా పై దాడిని ఆపాలని ఇజ్రాయెల్ నిర్ణయించడంతో ఇరాన్ తో అమి తుమీ తెల్చుకునేందుకు జ్యూయిష్ గవర్నమెంట్ ఆలోచిస్తుందని తెలుస్తోంది. ప్రతి దాడికి ఇజ్రాయెల్ దిగితే  ఇరాన్ స్పందన ఎలాఉంటుంది. ఆ తర్వాతి పరిణామాలు ఎలా మారతాయా అన్న ఆందోళనలో ఐక్యరాజ్యసమితి ఉంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం యూఎన్ వో తీసుకోలేదు.  రానున్న రోజుల్లో  యుద్ధమే ప్రారంభమైతే దాన్ని ఆపడం అంత సుళువు కాదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారీ తీసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు