Israel Stopeed Iran Missiles: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. మొన్నటి వరకూ హమాస్ తో పోరాడిన ఇజ్రాయెల్ (Israel) ఇప్పుడు ఇరాన్ (Iran)తో తలపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ శనివారం ఏకంగా 170 డ్రోన్లు, 30కి పైగా క్రూజ్, 120 బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేయగా వీటిని ఇజ్రాయెల్ అడ్డుకుంది. ఇరాన్ ప్రయోగించిన వాటిలో 99 శాతం డ్రోన్లు, క్షిపణులను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల సాయంతో ఇజ్రాయెల్ సమర్థంగా నేలకూల్చింది.


ప్రత్యేక ఆపరేషన్


సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన రాయబార కార్యాలయంపై ఇటీవల వైమానికి దాడులు జరగ్గా.. ఇరాన్ కు చెందిన సీనియర్ అధికారి సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ భావిస్తోంది. కొద్దిరోజులుగా పగతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ పై దాడి తప్పదని హెచ్చరిస్తోంది. అయితే, అమెరికా నిఘా వర్గాల అంచనాతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్ 'ఆపరేషన్ టూ ప్రామిస్' పేరుతో విడతల వారీగా డ్రోన్లు ప్రయోగించింది. సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా సైరెన్లు మోగించి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రజలకు సూచించింది. ఇరాన్ గగనతలం మీదుగా వస్తోన్న డ్రోన్లను బహుళ అంచెల రక్షణ వ్యవస్థతో కూల్చేశాయి. క్రూజ్ క్షిపణులనూ ఇజ్రాయెల్ విజయవంతంగా అడ్డుకుంది. కాగా, ఇరాన్ కు లెబనాన్, సిరియా, ఇరాక్ లోని మిలిటెంట్ సంస్థలూ పాల్గొన్నాయి. ఇజ్రాయెల్ పై రాకెట్ల వర్షం కురిపించగా.. టెల్ అవీవ్ సమర్థంగా తిప్పికొట్టింది.


ఎలా అడ్డుకుందంటే.?


ఇరాన్ గగనతలం నుంచి వందల సంఖ్యలో వచ్చిన డ్రోన్లను ఇజ్రాయెల్ సమర్థంగా నేలకూల్చింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఇజ్రాయెల్ కు సహకరించాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థతో ఇది సాధ్యమైంది. అందులో ప్రత్యేకతలు ఓసారి చూస్తే


అమెరికా రూపొందించిన గగనతల వ్యవస్థ 'ది యారో'. ఇది బాలిస్టిక్ సహా ఏ తరహా దీర్ఘ శ్రేణి క్షిపణులనైనా అడ్డుకోగలదు. భూ వాతావరణం వెలుపలా పని చేసే సామర్థ్యం దీనికి ఉంది. హమాస్ తో జరుగుతున్న యుద్ధంలో యెమెన్ నుంచి హూతీ వేర్పాటువాదులు ప్రయోగించిన క్షిపణులను ఈ వ్యవస్థతోనే ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది.


అలాగే, అమెరికా తయారు చేసిన 'డేవిడ్ స్లింగ్' అనే వ్యవస్థతో మధ్య శ్రేణి క్షిపణులను అడ్డుకోవచ్చు. లెబనాన్ నుంచి హెజ్ బొల్లా ప్రయోగించే మిస్సైళ్లను అడ్డుకోవడానికి ఈ వ్యవస్థనే ఇజ్రాయెల్ ఎక్కువగా వినియోగిస్తోంది.


డ్రోన్లు కూల్చడానికి 'పేట్రియాట్' అనే రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ చాలా కాలం నుంచి వినియోగిస్తోంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో వీటి పేరు మార్మోగిపోయింది. ఇరాక్ ప్రయోగించిన స్కడ్ క్షిపణులను ఇవి విజయవంతంగా అడ్డుకున్నాయి.


ఇజ్రాయెల్.. అమెరికా సహకారంతో 'ఐరన్ డోమ్' అనే వ్యవస్థను తయారు చేసింది. తక్కువ దూరం నుంచి ప్రయోగించే రాకెట్లను ఇది అడ్డుకుంటుంది. లెబనాన్ హెజ్బొల్లా, గాజా నుంచి హమాస్ ప్రయోగించే రాకెట్లను గత కొన్నేళ్లుగా ఈ వ్యవస్థ నిర్వీర్యం చేస్తోంది. ఎవరైనా రాకెట్లు ప్రయోగిస్తే ఈ వ్యవస్థ ఆటోమేటిక్ గా పని చేస్తుంది.


ఇజ్రాయెల్ లేజర్ సాంకేతికతతో ఇటీవల కొత్తగా అభివృద్ధి చేసిన వ్యవస్థ 'ఐరన్ బీమ్'. మిగిలిన గగన రక్షణ వ్యవస్థలతో పోలిస్తే ఇది చాలా చౌక. ఇరాన్ శనివారం చేసిన దాడిలోనూ ఈ లేజర్ వ్యవస్థ వాడినట్లు సమాచారం. బహుళ అంచెల రక్షణ వ్యవస్థతో ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ కు పెద్దగా నష్టమేమీ సంభవించలేదు.


Also Read: Israel-Iran Conflict: డ్రోన్, మిస్సైల్ దాడుల్ని ఇక్కడితో ఆపకపోతే తీవ్ర పరిణామాలు - ఇరాన్, ఇజ్రాయెల్‌కు పోప్ ఫ్రాన్సిస్ వార్నింగ్