Rajasthan Congress Crisis:
అలాంటి వ్యక్తిని సీఎం చేస్తారా..?
రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో మల్లికార్జున్ ఖర్గే వచ్చారు. ఈ లోగా గహ్లోట్ సోనియాను కలవటం...ఆమెకు క్షమాపణలు చెప్పడం అన్నీ జరిగిపోయాయి. కానీ...రాజస్థాన్ సీఎం కుర్చీ విషయంలో మాత్రం రగడ చల్లారలేదు. తనను పక్కన పెట్టి సచిన్ పైలట్‌కు అధికారం అప్పగిస్తే ప్రభుత్వం నిలబడదని గహ్లోట్...సోనియాతో చెప్పినట్టుసమాచారం. గహ్లోట్‌తో పాటు ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలంతా సచిన్ పైలట్‌పై గుర్రుగా ఉన్నారు. ఆయనకు అధికారం దక్కకూడదని చాలా మొండి పట్టు పడుతున్నారు. సచిన్ పైలట్‌కు అహం ఎక్కువ అని మండి పడుతున్నారు. స్టేట్ చీఫ్‌గా ఉన్నప్పుడే కాంగ్రెస్‌ను ముంచాలని చూశారని, అలాంటి వ్యక్తిని సీఎంగా చేయాలన్న ఆలోచనే రాకూడదని గహ్లోట్ వర్గీయులు చాలా గట్టిగానే వాదిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పోరు నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించే ముందు...సోనియాతో దాదాపు గంటన్నర పాటు భేటీ అయ్యారు గహ్లోట్. ఆ సమయంలోనూ సచిన్ పైలట్‌పై తనకున్న అసంతృప్తినంతా వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. నిజానికి...కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గహ్లోట్‌నే చూడాలని అనుకున్నారు సోనియా గాంధీ. నామినేషన్ వేసేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. కానీ...ఉన్నట్టుండి ఒక్కరోజులో రాజస్థాన్ రాజకీ యాలన్నీ మారిపోయాయి. ఒక వ్యక్తి ఒకే పదవి నిబంధన ప్రకారం...గహ్లోట్ అధ్యక్ష పదవికి ఎంపికైతే..రాజస్థాన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే ఆయనకు, అధిష్ఠానానికి పొసగలేదు.
గహ్లోట్‌నే కొనసాగిస్తారా..?
రాజస్థాన్‌లో జరిగిన పరిణామాలకు తనను నిందించకూడదని సోనియాతో గహ్లోట్ చెప్పారట. అయితే...సచిన్ పైలట్‌కు రాజస్థాన్ రాజకీయాల్లో ఎలాంటి చోటు లేదని చాలా స్పష్టంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే...రాష్ట్రానికి ఎవరు సీఎంగా ఉండాలన్న సోనియా గాంధీ నిర్ణయిస్తారని...కేసీ వేణుగోపాల్ ఇప్పటికే ప్రకటించారు. ఇక్కడే ఓ హింట్ కూడా ఇచ్చారు. ఎవరికైతే ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా ఉంటుందో తప్పకుండా వారినే సీఎం కుర్చీలో కూర్చోబెడతారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే...గహ్లోట్‌నే కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది. సచిన్ పైలట్‌ను రాజస్థాన్‌కు పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో ఏదైనా బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. రాజస్థాన్‌ను వదిలేందుకు సిద్ధంగా లేనని, అలా అని సచిన్ పైలట్‌కు పగ్గాలిస్తే...ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదని అన్నారు గహ్లోట్. భవిష్యత్‌లో పైలట్ కాంగ్రెస్‌ను వీడి రెబల్‌గా మారే అవకాశాలూ ఉన్నాయని అన్నారు. నిజానికి...అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గే సరైన విధంగా స్పందించి ఉంటే...ఇంత జరిగేదే కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. గహ్లోట్‌ను కలిసి మాట్లాడి ఉంటే ముందే ఈ వివాదం చల్లారేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అంతకు ముందు...కొన్ని ఊహాగానాలు వినిపించాయి. సచిన్ పైలట్ సీఎం కుర్చీలో కూర్చుంటారని, సీపీ జోషికి ఆర్థిక మంత్రిత్వ శాఖ కట్టబెడతారని గట్టిగానే చర్చ నడిచింది. అయితే...రాజకీయ అలజడి రేగిన ప్రతిసారీ ఇలా రకరకాల పేర్లు వినిబడటం సహజమేనని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి...కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌కు ఇప్పుడు రాజస్థాన్ తలనొప్పి పట్టుకుంది.
Also Read: Sajjala On Harish Rao : హరీష్ రావు ఆ గ్యాంగ్‌తో జత కట్టారంటున్న సజ్జల - ఆ గ్యాంగ్ ఎవరు ? ఆ కథేంటి ?