కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు జమ్ముకశ్మీర్ వెళ్లనున్నారు. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారి రాహుల్ అక్కడికి వెళ్తున్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసిన రెండు వారాల తర్వాత ప్రతిపక్షాల బృందంతో శ్రీనగర్ వచ్చిన రాహుల్ గాంధీని విమానాశ్రయం నుంచే తిరిగి పంపిచేసింది ప్రభుత్వం. 


ఇదే షెడ్యూల్.. 


జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు గులామ్ అహ్మద్ అల్లుడు రిసెప్షన్ కు రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం హాజరు కానున్నారు. రాజధాని శ్రీనగర్ లో పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించనున్నారు రాహుల్. అంతకంటే ముందు మంగళవారం ఉదయం 9 గంటలకు ఖీర్ భవానీ ఆలయానికి వెళ్లనున్నారు. ఆ తర్వాత శ్రీనగర్ లో ఉన్న హజ్రత్ బల్ మసీదును సందర్శించనున్నారు. అక్కడే ఉన్న గురుద్వారాకు కూడా రాహుల్ వెళ్లే అవకాశం ఉంది.


కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రాహుల్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు.


ఎందుకింత ప్రాధాన్యం?


రాహుల్ గాంధీ పర్యటనకు ఇంత ప్రాధాన్యం రావడానికి కారణం.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కాంగ్రెస్ నేత ఇక్కడకు రావడమే. ఆర్టికల్ 370 రద్దను రాజ్యాంగవిరుద్ధంగా కాంగ్రెస్ అభివర్ణించింది.


జమ్ముకశ్మీర్ కు రాష్ట్రహోదా ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే ఆర్టికల్ 370 పునురుద్ధరణపై అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఆలోచన చేస్తామని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇటీవల తెలిపారు. అయితే కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను అధికారికంగా ధ్రువీకరించలేదు.


ప్రస్తుతం రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్ పర్యటన నేపథ్యంలో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఆయన ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.


ఆ రద్దుకు రెండేళ్లు..


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వచ్చినా, స్థానిక పార్టీలు పూర్తిస్థాయిలో వ్యతిరేకించినా ఆర్టికల్‌ 370ని రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.


ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తీవ్రవాద చర్యలు 60 శాతం తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రాళ్ల దాడులు 87 శాతం మేర తగ్గినట్లు పేర్కొన్నాయి. పర్యటక రంగం 20 నుంచి 25 శాతానికి తిరిగి పుంజుకుంది. అయితే అభివృద్ధి ఎలా ఉన్నా అక్కడి స్థానిక పార్టీలు మాత్రం దీనిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఆ పార్టీలన్నీ కలిసి పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ పేరుతో ఓ కూటమిగా ఏర్పడ్డాయి.