వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెండో బృందం విచారణకు పులివెందులకు చేరుకుంది. ఇప్పటికే  జరుపుతున్న విచారణ బృందానికి.. కొత్త టీమ్ సహకరిస్తుంది. ఇటీవల వివేకా హత్య కేసులో కీలక పరిమామాలు చోటు చేసుకుంటున్నాయి. సునీల్ కుమార్ యాదవ్ అనే యువకుడ్ని సీబీఐ అధికారులు గోవాలో అరెస్ట్ చేసి పులివెందులకు తీసుకు వచ్చారు. ఆయనను పది రోజుల కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆయుధాల సమాచారం చెప్పారంటూ.. పులివెందుల వాగులో మూడు రోజులుగా పోలీసుల సాయంతో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. కానీ వారికి వాగులో ఎలాంటి ఆయుధాలు కనిపించలేదు. దర్యాప్తు, సోదాలు కొనసాగిస్తున్నారు. 


మరో వైపు మరికొంత మందిని ప్రశ్నించేందుకు సీబీఐ రెండో టీమ్‌ను పులివెందులకు పంపారు. రెండో బృందం పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్‌ హౌస్‌లో అనుమానితుల్ని ప్రశ్నిస్తోంది.  వైఎస్ వివేకా కుటుంబానికి సన్నిహితులయిన యూరేనియం సంస్థ ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డి, ఆయన తండ్రి ప్రకాష్ రెడ్డి, పని మనిషి లక్ష్మమ్మ, ఆమె కుమారుడు ప్రకాష్‌తో పాటు వివేకానందరెడ్డి ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన హిదయతుల్లాను సీబీఐ రెండో బృందం ప్రశ్నిస్తోంది. వీరందర్నీ గతంలోనే పలు మార్లు మొదటి బృందం ప్రశ్నించింది. ఇప్పుడు రెండో బృందం మరోసారి ప్రశ్నించి వివరాలు తెలుసుకుంటోంది.  కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మెన్ రంగయ్యను కూడా సీబీఐ రెండో టీం ప్రశ్నించింది. 


మరో వైపు రెండో సీబీఐ బృందాన్ని వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు కలిశారు. వారికి మరిన్ని వివరాలు అందించారు. తన తండ్రి హత్య కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదని గతంలో సునీత బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టులో న్యాయపోరాటం చేసి సీబీఐ దర్యాప్తు కోసం పోరాడారు. ఆ తర్వాత సీబీఐ పెద్దగా దర్యాప్తు చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ..  రెండో  బృందం కూడా దర్యాప్తునకు రావడంతో... వారికి అందుబాటులో ఉంటున్నారు. వారికి కావల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు  ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. 


సునీల్ యాదవ్ కస్టడీలో  వెల్లడయ్యే వివరాలను బట్టి కేసును చేధించాలన్న పట్టుదలతో సీబీఐ ఉంది. ఆయన చెప్పే వివరాలను బట్టి తదుపరి దర్యాప్తు వేగంగా చేయడానికే రెండో బృందం వచ్చిందని భావిస్తున్నారు. అందుకే మరో వారం పాటు సీబీఐ రెండో టీం పులివెందులలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లోపులే సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసును ఓ కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది.