ప్రజల జేబుల్లో డబ్బులుంటేనే వారి కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారుల ఖాతాల్లో లక్ష కోట్ల రూపాయలకు పైగా జమచేశారన్నారు. తెచ్చే ప్రతి పైసా అప్పునూ సద్వినియోగం చేస్తున్నామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అర్హులందరికీ అందిస్తున్నారని తెలిపారు. జగన్‌ అనుసరించే మత విశ్వాసాన్ని  ఆధారంగా చేసుకుని దుష్ప్రచారం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలు, నాయకుల ట్రీట్‌మెంట్లో గానీ ఎక్కడా కుల, మత ప్రభావాలు కనిపించవని స్పష్టం చేశారు. అలాంటప్పుడు పనిగట్టుకుని చేస్తున్న బీజేపీ దుష్ప్రచారాన్ని అందరూ కలసికట్టుగా అడ్డుకోవాలని సజ్జల పిలుపునిచ్చారు.


భారతీయ జనతా పార్టీ పాలనలో కేంద్ర ప్రభుత్వం రూ.కోటి 16లక్షల కోట్లు అప్పు చేసిందని, కొవిడ్‌ సమయంలోనే రూ.20లక్షల కోట్లు అదనంగా అప్పు చేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం చేసిన అప్పుతో పోలిస్తే రాష్ట్రం చేసిన అప్పు చాలా తక్కువన్నారు.  ఇతర రాష్ట్రాల్లోనూ ఇంతకు మించి అప్పులు చేశారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీజేపీ నేతలకు ప్రజల సమస్యలపై పోరాటం, సమస్యల పరిష్కారం అనే అజెండాతో సంబంధం లేదని, మతం ప్రాతిపదికగా దుష్ప్రచారం చేయడమే వారి అజెండా అన్నారు. రాబోయే రోజుల్లో మత విశ్వాసాలు, ఆర్థికపరమైన అంశాలే అజెండాగా దాడి జరగబోతోందని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నేతలు సిద్ధంగా ఉండాలన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఆర్యవైశ్య నేతల సమావేశంలో సజ్జల పాల్గొన్నారు.  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, పలువురు వైసీపీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.


వారం రోజుల క్రితం  ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలసిన ఏపీ బీజేపీ నేతలు.. రాష్ట్ర అప్పులపై ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.25వేల కోట్లు అప్పు చేసిందని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఆర్బీఐ నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించారు. దీనిపై స్పందించిన వైసీపీ నేతలు…. ఏపీని వేలెత్తి చూపిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు కనిపించడంలేదా అని ప్ర‌శ్నించారు. ఏపీలో ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమవుతున్నా.. ఎక్కడా ఆగిపోలేదని, సామాజిక పింఛన్లు సైతం ఒకటో తేదీనే ఇచ్చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతోనే తిప్పలు ఎక్కువయ్యాయని, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు. అయితే కేంద్రం చేసే అప్పులపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని సోము వీర్రాజు బదులిచ్చారు.


Also Read: గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండా… తెలంగాణ సర్కార్ లేఖలు.. పరిగణనలోకి తీసుకోని బోర్డులు