మా ఎన్నికల కోసం టాలీవుడ్‌లో వాడీవేడి వాతావరణం నెలకొంది. మొన్నటి వరకు మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య నెలకొన్న వాగ్వాదాలు చర్చనీయం కాగా.. తాజాగా ‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై నటి హేమా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. నరేష్ ఆధ్వర్యంలో ‘మా’ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని హేమా చేసిన ఆరోపణలపై నరేష్, జీవిత స్పందించారు. 


విలేకరుల సమావేశంలో నరేష్ మాట్లాడుతూ.. హేమా వ్యాఖ్యలను ఖండించారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ గౌరవ మర్యాదలను దెబ్బతీసేలా హేమ మాట్లాడారని తెలిపారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కమిటీ తీసుకొనే నిర్ణయం ప్రకారమే ఆమెపై చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వల్లే ఎన్నికలు వాయిదా పడుతున్నాయని, ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయిస్తామన్నారు.


కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించకూడదని హైకోర్ట్, సుప్రీం కోర్టులు చెప్పాయని నరేష్ గుర్తు చేశారు. ఈ నెల 22న జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందని నరేష్ తెలిపారు. ‘మా’లో ప్రస్తుతం 4.70 కోట్ల ఫండ్ ఉందన్నారు. కరోనా సమయంలో మా సభ్యుల కోసం ఎన్నో సేవలను చేశామని, ఫండ్‌ను ముట్టుకోకుండా బయట నుంచి నిధులు సేకరించామన్నారు. ఇందుకు పరిశ్రమ పెద్దలు, స్నేహితులు ఎంతో సహకరించాని తెలిపారు. అన్నింటికీ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. 


జీవిత మాట్లాడుతూ.. ‘‘హేమా చెప్పిన మాటలు చాలా తప్పుగా అనిపించాయి. సభ్యులకు ఆలోచించి ఓటు చేసే స్వేచ్ఛను ఇవ్వండి. ఇలా గందరగోళానికి గురిచేయకండి. మెంబర్స్ చనిపోతుంటే ఫండ్ ముట్టుకోమని, వారిని చనిపోనిస్తామా? ఆ నిధులతో సభ్యులకే లబ్ది జరిగింది. మా ఇంట్లో పెళ్లి చేసుకున్నామా? లేదా నరేష్ పార్టీలు చేసుకున్నారా?’’ అని ప్రశ్నించారు.  


మా ఎన్నికల కోసం ఒక వర్గం పట్టుబడుతుంటే.. మరోవర్గం మాత్రం ఏకగ్రీవం చేయాలనే వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, నరసింహారావులు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘మా’కు సొంత బిల్డింగ్ కట్టాలన్న నినాదంతో వీరు పోటీకి సిద్ధమయ్యారు. అయితే, హేమా.. ఇటీవల ‘మా’ నిధుల వినియోగంపై తీవ్ర ఆరోపణలు చేయడం వల్ల వివాదం రాజుకుంది. 


‘‘కొంతమంది నరేష్‌ను అధ్యక్షుడిగా కొనసాగించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మా అసోషియేషన్‌లోని రూ.5 కోట్ల నిధుల్లో ఇప్పటికే నరేష్ రూ.3 కోట్లను ఖర్చు చేశారు. ఇదివరకు ఆఫీస్ ఖర్చులకు బయట నుంచి నిధులు తీసుకొచ్చి ఫండ్ రైజ్ చేసేవాళ్లం. కానీ నరేష్ హాయిగా కూర్చొని అకౌంట్లోని సొమ్ములన్నీ ఖర్చుపెట్టేస్తున్నారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలను తప్పకుండా నిర్వాహించాలనే డిమాండ్‌తో 200 నుంచి 250 మందికి లెటర్ పంపిస్తున్నా. ఇంతవరకు ‘మా’ అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించలేదు. రూ.5 కోట్ల నిధులను రూ.2 కోట్లకు తీసుకొచ్చారు. గత మెడికల్ క్లైయిమ్, రానున్న మెడికల్ క్లైమ్‌కు కలిపి సుమారు రెండున్నర కోట్లకు పైగా ఖర్చయ్యాయి. ఆఫీస్ ఖర్చులతో కలిపితే సుమారు రూ.3 కోట్లు అవుతుంది. నరేష్ ఆ కూర్చీ దిగకూడదు, ఎన్నికలు జరగకూడదని ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలు తప్పకుండా జరగాలనే డిమాండుతోనే ఈ లేఖ పంపుతున్నా. ఇందుకు మీ మద్దతు కావాలి’’ అని హేమా ఇటీవల వ్యాఖ్యానించారు.