Rahul Gandhi on Pappu Comments:
ఇందిరా గాంధీని ప్రస్తావిస్తూ..
తనను "పప్పు" అని కామెంట్ చేయడంపై రాహుల్ గాంధీ స్పందించారు. అలా పిలవడం తనకొచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తన నాయనమ్మ ఇందిరా గాంధీ గురించి ప్రస్తావించారు. ఆమెనూ మొదట్లో ఎవరూ లెక్క చేయలేదని, ఏది పడితే అది మాట్లాడారని...తరవాత ఆమె ఐరన్ లేడీగా చరిత్రకెక్కారని అన్నారు. "ఐరన్ లేడీగా మారక ముందు ఆమెను అందరూ గుంగి గుడియా అంటూ అవమానించారు. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వాళ్లే ఆమెనూ అలా కించపరిచారు. కానీ...ఉన్నట్టుండి ఆమే ఉక్కుమహిళగా మారారు" అని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. "మీరెలాగైనా పిలుచుకోండి. నాకే బాధా లేదు. నేను వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేశారు. ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీతో తనకున్న బంధాన్నీ గుర్తు చేసుకున్నారు. "ఆమె నాకు రెండో అమ్మ లాంటిది" అని అన్నారు. "ఇందిరా గాంధీలోని లక్షణాలున్న అమ్మాయిలను మీరు ఇష్టపడతారా?" అని ప్రశ్నించగా...ఆసక్తికర సమాధానం చెప్పారు రాహుల్. "ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మా అమ్మ, నాయనమ్మ క్వాలిటీస్ కలగలిపి ఉన్న అమ్మాయైతే చాలా మంచిది" అని బదులిచ్చారు.
చలిలో...టీ-షర్ట్‌తో...
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 3750 కిలోమీటర్లు పూర్తి చేసుకొని దిల్లీలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ యాత్ర కొద్ది రోజులు ఆపి మళ్లీ 2023 జనవరి నెలలో పునఃప్రారంభిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. మహాత్మా గాంధీ, ఇతర మాజీ ప్రధాన మంత్రుల స్మారకాలను సందర్శించి నివాళులర్పించారు. అయితే వణికించే దిల్లీ చలిలో అయన టీ షర్ట్, ప్యాంట్ మాత్రమే వేసుకొని కనిపించారు. దిల్లీ చలిలో ఎలాంటి స్వెటర్ లేకుండా ఆయన సాధారణ దుస్తుల్లో రావడం.. నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. సోమవారము ఉదయం దిల్లీలో 6 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత పడిపోయింది. ఆ చలిలో రాహుల్ గాంధీ.. రాజ్ ఘాట్, విజయ్ ఘాట్, శక్తి స్థల్, వీర్ భూమి, సదైవ్ అటల్ వంటి భారత మాజీ ప్రధానమంత్రుల స్మారకాలను సందర్శించి.. నివాళులు అర్పించారు. ఈ సందర్శనలో రాహుల్ కేవలం టీ షర్ట్, ప్యాంట్ వేసుకొని, చెప్పులు కూడా లేకుండా చలిలో మహా నాయకులకు నివాళులు అర్పించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇంత చలిలో మీరు ఎందుకు చలి దుస్తులు ధరించలేదని రాహుల్ గాంధీని మీడియా కూడా ప్రశ్నించింది, దీనికి రాహుల్ తనదైశ శైలిలో సమాధానమిచ్చారు.
" అందరూ నన్ను మళ్ళీ మళ్ళీ మీకు చలి వేయలేదా? ఎందుకు చలి దుస్తులు ధరించలేదు అని అడుగుతున్నారు. వారు ఓ రైతునో, కార్మికుడినో, పేద పిల్లలను ఈ ప్రశ్న ఎందుకు అడగరు? "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Also Read: Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్లకూ ఇది అవసరమా?