కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. మోదీ సర్కార్ తీసుకువచ్చిన 'ఆత్మ నిర్భార్ భారత్'పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన సమతామూర్తి విగ్రహం.. చైనాలో తయారైందని ట్వీట్ చేశారు.
216 అడుగుల ఎత్తైన ఈ సమతా విగ్రహం చైనాలో తయారైందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రం చెప్పే ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్నిపరోక్షంగా ప్రస్తావిస్తూ నవభారత్ చైనా నిర్భరా అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
రూ.135 కోట్లతో నిర్మించిన రామానుజాచార్య విగ్రహాన్ని చైనాకు చెందిన ఎయిర్‌సన్ కార్పొరేషన్ తయారు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. 2015లోనే ఈ కాంట్రాక్ట్ వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ వార్తల ఆధారంగానే రాహుల్ గాంధీ.. మోదీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 5న హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుడి సమతా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది.
రాహుల్ విమర్శలు..
మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఇటీవల విమర్శల దాడి పెంచారు. పెగాసస్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా పలు కీలక అంశాలపై ఇటీవల లోక్‌సభ వేదికగా రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురింపిచారు.
Also Read: Fact Check: 'అప్పు లేని రాష్ట్రంగా దిల్లీ' అనే వార్త తప్పా?.. ఇందులో నిజమెంత?