ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ఒక్కరోజు ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. లఖ్‌నవూలో జరిగిన కార్యక్రమంలో 'ఉన్నతి విధాన్' అనే పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
ముఖ్యంగా మహిళలు, రైతులు, చిన్న వ్యాపారుల జీవన ప్రమాణాలను పెంచడంపై మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఎక్కువ దృష్టి సారించింది. ఉత్తర్‌ప్రదేశ్ అభివృద్ధిపై కీలక సూచనలు చేసింది.
ప్రజల క్షేమం, రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అజెండాగా పని చేసే ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్‌కు కావాలి. అలాంటి రాజకీయ వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. అలాంటి మార్పునకు ఈ మెనిఫెస్టో దారి లాంటిది.
ఇవే హామీలు..
- అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రైతుల రుణాలు మాఫీ.
- రైతుల విద్యుత్ బిల్లులు సగానికి తగ్గింపు. కరోనా సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లులు మాఫీ.
- కరోనాతో బాధపడిన కుటుంబాలకు రూ.25 వేల ఆర్థిక సాయం.
- ఉద్యోగాల్లో మహిళలకు 40% రిజర్వేషన్
- 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. మహిళలకు 8 లక్షల ఉద్యోగాలు.
- అంకుర సంస్థల కోసం రూ.5 వేల కోట్లతో విత్తనాల స్టార్టప్ నిధి ఏర్పాటు.
- కరోనాతో మృతి చెందిన ఫ్రంట్‌లైన్ వర్కర్ల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం.
- 2 లక్షల టీచర్ ఉద్యోగాల భర్తీ. సంస్కృతం, ఉర్దు టీచర్ల ఉద్యోగాలకు అవకాశం.
- వరి, గోధుమ క్వింటాల్‌కు రూ.2500 మద్దతు ధర. క్వింటాల్ చెరుకుకు రూ.400
- దివ్యాంగులైన మహిళల పింఛను రూ.3 వేలకు పెంపు.
- మహిళా పోలీసు అధికారులకు తమ హోంటౌన్‌లోనే పోస్టింగ్‌కు అనుమతి.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 7 విడతల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.
Also Read: Fact Check: 'అప్పు లేని రాష్ట్రంగా దిల్లీ' అనే వార్త తప్పా?.. ఇందులో నిజమెంత?
Also Read: Drone Shot Down: పంజాబ్ ఎన్నికల వేళ పాక్ డ్రోన్ కలకలం.. ఆ రెండు ప్యాకెట్లలో ఏముందంటే?