Quad Summit in India: 



వచ్చే ఏడాది భారత్‌లోనే క్వాడ్ 


ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఉన్నారు. హిరోషిమాలో జరుగుతున్న G7 సదస్సుకి (G7 Summit)కి హాజరయ్యారు. జపాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతరత్రా అంతర్జాతీయ సవాళ్లపై పలు దేశాల అధినేతలతో చర్చించారు. ఈ సమయంలోనే ఓ కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆరు దేశాల అధినేతలతో చర్చించిన ఆయన G-20తో పాటు క్వాడ్ (QUAD) గురించీ ప్రస్తావించారు. వచ్చే ఏడాది క్వాడ్ సమ్మిట్ (Quad Summit in India) భారత్‌లోనే జరుగుతుందని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ ఈ సదస్సు జరగనుంది. క్వాడ్‌ దేశాల అధినేతలంతా ఒకే వేదికపై కనిపించనున్నారు. ఇప్పటికే G-20 సదస్సుకి భారత్ అధ్యక్షత వహించేందుకు సిద్ధమవుతోంది. తరవాత క్వాడ్ సమావేశమూ భారత్‌లోనే జరగనుండటం కీలకంగా మారింది. అంతర్జాతీయంగా భారత్‌కున్న చరిష్మా మరింత పెరగనుంది. అయితే...ఈ క్వాడ్ సమావేశంతో ప్రపంచ దేశాలకు భారత్ ఏ సందేశం ఇవ్వనుంది..? దీనిపై కొందరు నిపుణులు ఇప్పటికే కీలక విషయాలు వెల్లడించారు. ఇంటర్నేషనల్‌గా ఇంపాక్ట్ ఉంటుందని తేల్చి చెబుతున్నారు. G20 సమ్మిట్‌తోనే ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై పడిందని, భారత్‌పై ఇప్పటి వరకూ వాళ్లకున్న ఆలోచనలు మారుతున్నాయని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.






శాంతి సందేశమిస్తారా? 


అయితే...ఈ క్వాడ్ సమ్మిట్‌లో భారత్‌ "శాంతి సందేశం" వినిపిస్తుందని అంచనా వేస్తున్నారు. దేశాల ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే.. శాంతియుత వాతావరణం చాలా కీలకమన్న విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ ఇదే వాణి వినిపించారు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే...ప్రపంచ దేశాలన్నీ శాంతి మార్గంలోనే నడవాలన్న సందేశం వినిపించాలని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో చైనాకి కూడా గట్టి కౌంటర్ ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే సరిహద్దు వివాదం విషయంలో పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది డ్రాగన్. ఒక్క భారత్‌నే కాదు. ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా, బ్రునెయి..ఈ అన్ని దేశాలతోనూ కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. ఇది తొలగిపోవాలంటే శాంతియుత చర్చలు అవసరం. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్న సందేశాన్ని భారత్ ఇచ్చే అవకాశముంది. దౌత్యం ద్వారానే శాంతి సాధ్యమవుతుందని...అందుకు అన్ని దేశాలూ ముందుకు రావాలని పిలుపునివ్వనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే...ఉద్దేశపూర్వకంగా చైనాతో కయ్యానికి దిగాలని మాత్రం భారత్ అనుకోవడం లేదు. క్వాడ్ సమ్మిట్‌లో ఈ సరిహద్దు వివాదాలతో పాటు విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులపైనా చర్చించనున్నారు.