విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి గొప్పతనాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి ఉత్సవాల (NTR Centenary Celebrations) సందర్భంగా శనివారం హైదరాబాదులో వేడుక నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సైతం ఆ వేడుకకు హాజరు అయ్యారు. ఎన్టీ రామారావుతో తనకు ఉన్న పరిచయాన్ని, ఆయన కుమార్తె పురంధేశ్వరి కుమారుడితో ఉన్న అనుబంధాన్ని ఆయన ఆ వేదికపై గుర్తు చేసుకున్నారు. 


ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ మన పవర్ చూపించారు!
''ఇప్పుడు విదేశాల్లో మన తెలుగు సినిమా గురించి చాలా గొప్ప‌గా మాట్లాడుతూ ఉన్నారు. సౌత్ ఇండియ‌న్ సినిమా బావుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ,  ఆ రోజుల్లోనే ఎన్టీఆర్‌ గారు మ‌న ప‌వ‌ర్ ఏంటో చూపించారు. ఆయన్ను మనం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోకూడ‌దు. గుర్తు చేసుకుంటూనే ఉండాలి'' అని రామ్ చరణ్ అన్నారు. 


అన్ని స్థాయిలకు మించిన పేరు ఎన్టీఆర్!
ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే తనకు ఎక్క‌డ మొద‌లు పెట్టాలో తెలియ‌టం లేదని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. అన్ని స్థాయిల‌కు మించిన పెద్ద పేరు నంద‌మూరి తార‌క రామారావు అని కొనియాడారు. ''ఒక రాముడి గురించో, కృష్ణుడి గురించో మాట్లాడ‌టం కంటే... మనం వారి గురించి మ‌న‌సుల్లో ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వాటిని ఎక్కువ‌ అనుభూతి చెందాలే త‌ప్ప మాట్లాడ‌కూడ‌దు. వాళ్ల విజ‌యాల‌ను, అటువంటి మహనీయులు వేసిన మార్గాల‌ను గుర్తుకు చేసుకుంటూ... ఆ మార్గాల్లో న‌డుస్తుంటే వ‌చ్చే ఆనందం అంతా ఇంతా కాదు. నాతో స‌హా ప్ర‌తి రోజూ సినిమా సెట్, షూటింగుకు వెళ్లే ప్ర‌తి ఆర్టిస్ట్ ఆయ‌న పేరుని గుర్తుకు తెచ్చుకోకుండా ఉండ‌రు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఏంటి? అని మ‌న పొరుగు రాష్ట్రాల‌తో పాటు దేశ, విదేశాల్లో చాటి చెప్పిన లెజెండ్ ఎన్టీ రామారావు గారు. అటువంటి వ్య‌క్తి ప‌ని చేసిన చిత్ర పరిశ్రమలో మేం అందరం ప‌ని చేస్తున్నామంటే అంత కంటే గర్వకారణం ఇంకేముంది!?'' అని రామ్ చరణ్ మాట్లాడరు. 


ఆయన్ను ఒక్కసారే కలిశా!
చిన్నతనంలో ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి కలిశానని రామ్ చరణ్ తెలిపారు. ''నేను, పురంధ‌ర‌రేశ్వ‌రి గారి అబ్బాయి రితేష్‌ స్కేటింగ్ క్లాసుల‌కు వెళ్లే వాళ్లం. ఉదయం ఐదున్న‌ర‌, ఆరు గంట‌ల‌కు క్లాసులు అయిపోయేవి. ఓ రోజు రితేష్ 'మా తాత‌య్య‌ గారి ఇంటికి వెళ‌దామా?' అని అడిగాడు. అప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్య‌మంత్రి. సీఎంకు పెద్ద సెక్యూరిటీ ఉంటుందని, అక్క‌డ‌కు వెళ్ల‌గ‌ల‌మా?  లేదా? అనేది కూడా తెలియదు. నేను, రితేష్ స్కేటింగ్ చేసుకుంటూ... వాళ్ళ ఇంటి నుంచి కింద‌కు వెళితే రామారావు గారి ఇల్లు వచ్చింది. అప్పుడు సమయం ఉద‌యం ఆరున్న‌ర గంట‌లు. ఎన్టీఆర్‌ గారిని క‌లిసి వెళ్లిపోదామ‌నుకున్నా. అయితే, ఆయ‌న అప్ప‌టికే రెడీ అయిపోయి టిఫ‌న్‌ చేయడానికి కూర్చున్నారు. అంద‌రికీ తెలిసిన‌ట్లే చికెన్ పెట్టుకుని హెల్దీగా తింటున్నారు. నన్ను చూసి, నాకు కూడా టిఫిన్ పెట్టారు. అది నాకు క‌లిగిన అదృష్టం. ఆయ‌న‌తో క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన ఆ క్ష‌ణాల‌ను జీవితాంతం మ‌ర‌చిపోలేను'' అని రామ్ చరణ్ వివరించారు. 


Also Read : బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు భారీగా డిమాండ్ చేసిన తమన్నా - క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ



ఎప్పటికీ ఎన్టీఆర్ పేరు ఉంటుంది!
తెలుగు ఇండ‌స్ట్రీ బ్ర‌తికున్నంత వ‌ర‌కు ఎన్టీఆర్ పేరు బ‌తికే ఉంటుందని రామ్ చరణ్ గొప్పగా చెప్పారు. రాబోయే త‌రాల‌కు కూడా ఆయ‌న గుర్తుండిపోయేలా, ఈ విధంగా ఫంక్ష‌న్స్ చేయడం చాలా ముఖ్యమన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ వేడుకను ఇంత గొప్ప‌గా నిర్వ‌హించిన చంద్ర‌బాబు నాయుడుకి, తనను ఆహ్వానించిన బాలకృష్ణకు థాంక్స్‌ చెప్పారు రామ్ చరణ్. ఇంకా మాట్లాడుతూ ''బాలకృష్ణ గారు ఎప్పుడూ మా ఫంక్ష‌న్స్‌కు వస్తూ ఉంటారు. ఆయ‌న‌కు మ‌రోసారి థాంక్స్. ఈ వేడుకకు వ‌చ్చినందుకు చాలా గ‌ర్వంగా ఉంది'' అని చెప్పారు. నంద‌మూరి అభిమానులంద‌రినీ క‌లిసినందుకు చాలా ఆనందంగా ఉందని, జై ఎన్టీఆర్‌ అంటూ స్పీచ్ ముగించారు రామ్ చరణ్. 


Also Read : గరీబోనితో సుమతి పాట - అనసూయను చూస్తూ ఉండిపోతారంతే!