Balakrishna Speech at Centenary Celebrations of NTR: తన తండ్రి ఎన్టీఆర్ కారణజన్ముడు, తనకు గురువు, దైవం అన్నారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. హైదరాబాద్ కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందర్నీ మహానుభావులు అనరు. అలా అనిపించుకోవాలంటే మహోన్నత భావాలు ఉండాలి, మహోన్నత ఆచరణ చేసిన వాళ్లే మహానుభావులు అవుతారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిల్చున్న వ్యక్తి ఎన్టీఆర్. ఏ నేతకు సాధ్యంకాని పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. ఎన్నో గొప్ప పాత్రలు ఆయన పోషించారని గుర్తుచేశారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా జీవించారని తన తండ్రి ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.
ఎన్టీఆర్ అందరికీ ఆదర్శం. వందేళ్ల కిందట ఓ వెలుగు వెలిగింది. ఆ వెలుగు మరో వెయ్యేళ్లకు సరిపడ కాంతినిచ్చింది. ఆయన పేరు తలుచుకుంటే తెలుగు జాతి ఒళ్లు పులకరిస్తుంది. ఇతను మా వాడు అని తెలుగు ప్రజలు చెప్పుకునే మనిషి ఎన్టీఆర్. తన జన్మను తెలుగుజాతికి ఓ బ్రహ్మోత్సవంలా మార్చేశారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా గుర్తొచ్చేది ఎన్టీఆర్. ఆయన నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందుతారన్నారు. నటనకు నిర్వచనం, నవరసాలకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నూతన శకానికి నాంది.
Also Read: NTR Centenary Celebrations Live Updates: ఎన్టీఆర్ కు కచ్చితంగా భారతరత్న ఇవ్వాల్సిందే - నారాయణమూర్తి
ఎన్టీఆర్ అంటే ఓ అగ్నికణం. భగవద్గీతలా ఆయన జీవితం సాగిందన్నారు. అందుకే నిరంతరం ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. నిత్యం వెలిగే మహత్తర జీవన విధానం ఎన్టీఆర్. జానపదాలు, పౌరానికాలు ఏవి నటిస్తే వాటికి ప్రాణం పోశారు. కళామతల్లి కళకళలాడిందన్నారు. ప్రపంచం మొత్తం ఎటు వెతికినా ఆయన లాంటి గొప్ప వ్యక్తి లేడన్నారు. ప్రతి పాత్రను అణువణువు నింపుకుని మెప్పించిన నటుడు తన తండ్రి అని గర్వంగా చెప్పారు బాలక్రిష్ణ. నేను తెలుగువాడ్ని అని చెప్పుకునేలా చేసిన అరుదైన వ్యక్తి ఎన్టీఆర్. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఇచ్చిన అన్నగా చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచిపోతారు. ఇటీవల విజయవాడలో శత జయంతి వేడుకలు జరుపుకున్నాం. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ వేదికగా అన్నగారి శత జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తన తండ్రి పాలిటిక్స్ లోకి రాకముందు తెలుగువారిలో రాజకీయ చైతన్యం అంతగా ఉండేది కాదన్నారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం తరువాత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది పాలిటిక్స్ ను కెరీర్ గా తీసుకున్నారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలను ఎంతో మంది నేతలు పాటిస్తున్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆహార భద్రతను ఎన్టీఆర్ ఎప్పుడో కల్పించారని గుర్తుచేశారు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చారు. పక్కా ఇళ్లు నిర్మించారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తూ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు ఎన్టీఆర్. స్థానిక ఎన్నికల్లో మహిళలకు అధిక రిజర్వేషన్ ఇచ్చిన ఘనత తన తండ్రి సొంతమన్నారు. పద్మావతి యూనిర్సిటీ, వైద్య విశ్వ విద్యాలయం ఏర్పాటు, సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేసి ఎందరికో విద్యను దగ్గర చేశారు. మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండో అధికారిక భాషగా ప్రకటించి అమలు చేశారని గుర్తుచేశారు.
Also Read: NTR Centenary Celebrations Jr NTR : శకపురుషుని శత జయంతి ఉత్సవాలు - రావడం లేదని చెప్పిన ఎన్టీఆర్, ఎందుకంటే?