సుమతిని చూస్తే చూపు తిప్పుకోలేరని అంటోంది 'విమానం' చిత్రబృందం! సుమతి పాట వస్తే అలా చెవులు అప్పగించి వింటూ ఉంటారని అంటోంది. ఇంతకీ, సుమతి ఎవరు? అనుకుంటున్నారా... అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)!


అనసూయ ఓ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'విమానం' (Vimanam Movie). ఈ చిత్రంలో ఆమె సుమతి పాత్ర చేశారు. ఆమెకు జోడీగా రాహుల్ రామ‌కృష్ణ‌  (Rahul Ramakrishna) నటించారు. సముద్రఖని, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, ధ‌న్‌రాజ్‌, మీరా జాస్మిన్, తమిళ నటుడు మొట్ట రాజేంద్ర‌న్ ఇతర ప్రధాన తారాగణం. 


మే 22న అనసూయ సుమతి పాట!
అనసూయ, రాహుల్ రామకృష్ణ మీద తెరకెక్కించిన 'సుమతి...' పాటను ఈ నెల 22న (సోమవారం) విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. 'ఏ సదువు సంధ్య లేదే... నాకే ఆస్తి పాస్తి లేదే... ఈ గరీబోని ముఖము జూసి గనువ తీయరాదే' అంటూ సాగే టీజర్ విడుదల చేశారు. 


'విమానం'లో అనసూయ, రాహుల్ రామకృష్ణ మధ్య సన్నివేశాలు, పాట హైలైట్ అవుతాయని... ఇద్దరూ అద్భుతంగా నటించారని చిత్ర బృందం తెలిపింది.


Also Read : బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు భారీగా డిమాండ్ చేసిన తమన్నా - క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ






చిన్నారి అమాయకత్వం... 
అంతకు మించి నిజాయతీ!
Vimanam Teaser Review : ఇటీవల 'విమానం' టీజర్ విడుదల చేశారు. ఈ సినిమాలో సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ తండ్రీ కుమారులుగా నటించారు. ఆ ఇద్దరి ప్రయాణమే చిత్ర కథాంశమని టీజర్ చూస్తే తెలుస్తోంది. అన్నిటి కంటే ముఖ్యంగా తండ్రీ కుమారుల మధ్య సంభాషణలు, కుమారుడి మాటల్లో ఏమీ తెలియని అమాయకత్వం, స్వచ్ఛత ఎక్కువగా ఆకట్టుకుంటాయి. 


'నాన్నా... అమ్మ దేవుడి దగ్గరకు వెళ్లిందని చెప్పావ్ కదా! విమానం ఎక్కి దేవుడి దగ్గరకు వెళ్ళిందా?' అని కుమారుడు అడిగితే... 'అవును రా' అని తండ్రి చెబుతాడు. వెంటనే మరో ఆలోచన కూడా లేకుండా 'అమ్మ ఎంత గ్రేట్ నాన్నా' అని కుమారుడు అంటాడు. తండ్రి మాటలను అంతలా నమ్మేసే అమాయకత్వం ఆ చిన్నారిది. అప్పటి నుంచి విమానం ఎక్కించమని తండ్రిని అడుగుతూ ఉంటాడు. 'బాగా చదువుకుని, పెద్దోడు అయ్యాక నువ్వే ఎక్కొచ్చు' అని తండ్రి చెబుతూ ఉంటాడు. 


విమానం గురించి పిల్లల మధ్య సంభాషణలు సైతం భలే ఉన్నాయి. 'బస్సు నడిపే వాడిని డ్రైవర్ అంటాడు. లారీ నడిపే వాడినీ డ్రైవర్ అంటారు. మరి, విమానం నడిపే వాడిని ఎందుకురా పైలట్ అంటారు?' అని ధ్రువన్ అడిగితే... 'పైకి వెళ్ళాక లైట్ వేసుకుంటాడు కాబట్టి పైలట్ అంటార్రా' అని ఫ్రెండ్ ఆన్సర్ ఇస్తారు. 


'నాన్నా! దేవుడు ఎప్పుడు కనిపించినా దణ్ణం పెట్టుకోమంటావ్ ఏంటి నాన్నా' అని కుమారుడు అడిగితే... 'అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి' అని చెబుతాడు తండ్రి! ఆ తర్వాత కుమారుడు 'అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు, నాన్నా అంటారు' అని చెప్పే మాట హృదయాలు కదిలిస్తుంది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 


Also Read హిందీలో 'మల్లేశం' దర్శకుడు తీసిన '8 ఎఎం మెట్రో' సినిమా రివ్యూ... మంచి ఫిల్టర్ కాఫీ తాగిన అనుభూతి



జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో 'విమానం'
జూన్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ సంస్థలు నిర్మించిన చిత్రమిది. దీనికి శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రానికి కళ : జె.జె. మూర్తి, కూర్పు :  మార్తాండ్ కె. వెంక‌టేష్‌, మాటలు : హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం), పాటలు : స్నేహ‌న్‌ (తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు), ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, సంగీతం : చ‌ర‌ణ్ అర్జున్‌.