పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భగత్‌ సింగ్‌ స్వస్థలం ఖతర్‌ కలన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరయ్యారు. పంజాబ్ రాష్ట్రానికి భగవంత్ మాన్ 17వ ముఖ్యమంత్రి.







మాన్‌ ప్రమాణ స్వీకారానికి ప్రజలు భారీగా తరలి రావడంతో భగత్‌ సింగ్‌ పూర్వీకుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కాగా 1970 తర్వాత సీఎం పగ్గాలు చేపడుతున్న చిన్న వయస్కుడు భగవంత్ మాన్ (48) కావడం విశేషం.


భారీ గెలుపు


పంజాబ్​లో 117 అసెంబ్లీ స్థానాల్లో 92 సీట్లను ఆప్ దక్కించుకుంది. ధురీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాన్​ 58,206 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోసారి అధికారం దక్కించుకుంటామని ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు ఆప్ భారీ షాక్ ఇచ్చింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీ, నవజోత్ సింగ్ సిద్ధూ సహా అగ్రనాయకులు అందరూ ఆప్ దెబ్బకు ఇంటిముఖం పట్టారు.


అంతేకాకుండా శిరోమణి అకాలీ దళ్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా ఓటమిపాలయ్యారు. మరోవైపు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా పరాజయం పొందారు.


కేజ్రీ వ్యూహాలు


దిల్లీ సీఎం కేజ్రీవాల్.. పంజాబ్‌లో పార్టీకి ఎంతో మెరుగైన అవకాశాలు ఉన్నాయని ముందుగానే గుర్తించి వ్యూహాలు అమలు చేశారు. దిల్లీ మోడల్‌ పరిపాలన, అధికారంలోకి వస్తే గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆప్‌కున్న క్లీన్‌ ఇమేజ్, ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో  దిల్లీలో ఆప్‌ చేస్తున్న అభివృద్ధి పంజాబ్‌లోని దిగువ మధ్యతరగతిని ఆకర్షించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన తప్పుల్ని దిద్దుకుంటూ ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రివాల్‌ వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు.


ప్రాంతీయ పార్టీ కాకపోవడంతో బయటవాళ్లు అన్న ముద్ర, ప్రత్యర్థులందరూ ఇదే అంశాన్ని పదే పదే ఎత్తిచూపిస్తూ ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆప్‌ తనదైన శైలిలో ముందుకు వెళ్లింది. పంజాబ్‌ ఓటర్లలో 45 శాతం ఉన్న.. 96 లక్షల మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుంది. 12 మంది విద్యాధికులైన మహిళలకు టికెట్లు ఇచ్చింది. అక్రమ ఇసుక తవ్వకాలపైనే ఆప్‌ ప్రధానంగా దృష్టి సారించింది. అక్రమ ఇసుక తవ్వకాలను అరికడితే రాష్ట్రానికి 20 వేల కోట్ల ఆదాయం వస్తుందని, దానిని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చునని కేజ్రివాల్‌ విస్తృతంగా ప్రచారం చేశారు. ఫలితం కనిపించింది.


Also Read: Bhagwant Mann Profile: స్టాండప్ కమెడియన్ నుంచి సీఎంగా స్టాండింగ్ వరకూ ! పంజాబ్ హీరో భగవంత్ మన్ !


Also Read: Hijab Ban Case: హోలీ తర్వాతే మళ్లీ హిజాబ్- అత్యవసర విచారణకు సుప్రీం నో