DA Hike Latest news: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Central Government Employees) మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది! ప్రస్తుతం ఉన్న డీఏను (DA) మరో 3 శాతం పెంచేందుకు ఆస్కారం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం కానుంది.


ప్రస్తుతానికి ఈ కేబినెట్‌ కమిటీ సమావేశం అజెండా ఇంకా తెలియలేదు.  బహుశా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (Dearness allowance - DA) పెంపు గురించి మంత్రులు చర్చించే అవకాశం ఉంది.


ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు 31 శాతం డీఏ ఇస్తున్నారు. దీనిని మరో 3 శాతానికి పెంచుతారని అంచనాలు ఉన్నాయి. ఒకవేళ అనుకున్నట్టుగానే పెంచితే డీఏ 34 శాతానికి చేరుతుంది. బడ్జెట్‌ రెండో దశ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేబినెట్‌ సమావేశం కావడం గమనార్హం.


DA ఎందుకిస్తారంటే?


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం డీఏను చెల్లిస్తుంది. ఇది ఉద్యోగులు, పింఛన్‌దారులకు వర్తిస్తుంది. ఏడో వేతన కమిషన్‌ (7th Pay Commission) ప్రకారం డీఏను ఏటా రెండుసార్లు పెంచుతారు. జనవరి, జులైలో వీటిని అమలు చేస్తారు. ఉద్యోగి పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టీ డీఏ పెరుగుదలలో తేడాలు ఉంటాయి. రూరల్‌, సెమీ అర్బన్‌తో పోలిస్తే అర్బన్‌ ఉద్యోగులకు ఎక్కువ డీఏ వస్తుంది.


నేడు జరిగే కేబినెట్‌ సమావేశంలో డీఏ పెంపు గురించి నిర్ణయం తీసుకుంటే కోటికి పైగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో 48 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారు. చివరిసారిగా డీఏను గతేడాది అక్టోబర్లో సవరించారు. 28 నుంచి 31 శాతానికి పెంచారు. ఇప్పుడు డీఏ పెంచితే పెంచిన వేతనాల్లో జనవరి, ఫిబ్రవరి డీఏ బకాయిలు కూడా ఉంటాయి. ఎందుకంటే దీనిని 2022 జనవరి నుంచి అమలు చేస్తారు.