Pro Pakistan Slogans Row: రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నాజిర్ హుస్సేన్ గెలుపొందారు. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే..ఈ వేడుకల్లో కొంత మంది పాకిస్థాన్‌కి అనుకూలంగా నినాదాలు చేశారని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసినట్టు బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రస్తుతం దీనిపై రాజకీయ వేడి పెరిగంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలోనే ఇలాంటి నినాదాలు చేయడమేంటని ప్రశ్నించింది. ఇప్పటికే బెంగళూరు పోలీసులు ఈ కేసుని సుమోటోగా స్వీకరించింది. అయితే...ఈ వీడియోలో కాంగ్రెస్ జిందాబాద్, సిద్దరామయ్య జిందాబాద్ నినాదాలు మాత్రమే వినిపించాయి. బీజేపీ మాత్రం పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలే వినిపించాయని తేల్చి చెబుతోంది. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ ఆరోపణలపై స్పందించారు. బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా పాకిస్థాన్‌కి అనుకూలంగా ఎవరైనా నినాదాలు చేసుంటే...కచ్చితంగా వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. అంతే కాదు. ఈ ఆరోపణలపై Forensic Science Lab (FSL) విచారణ చేపట్టాలని ఆదేశించారు. కర్ణాటకలోని నాలుగు రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ మూడు గెలుచుకుంది. మరోటి క్రాస్ ఓటింగ్ ద్వారా బీజేపీ విజయం సాధించింది. ఇదే సమయంలో ఆ ఆరోపణల్ని ప్రభుత్వం కొట్టి పారేసింది. కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేసి అలజడి సృష్టించినందుకు బీజేపీ నేతలపై ఫిర్యాదు చేసింది. అటు కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇదంతా బీజేపీ కుట్ర అని విమర్శించారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 


"ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి ఆ వాయిస్ రిపోర్ట్‌ పంపించాం. ఈ రిపోర్ట్ వచ్చిన తరవాతే దీనిపై ఓ స్పష్టత వస్తుంది. ఈ విచారణలో ఎవరైనా నిందితులు అని తేలితే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా శిక్షిస్తాం"


- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి