Rajiv Gandhi Killer Santhan Dead: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడైన టి సుతేంద్ర రాజా అలియాస్ (T Suthendraraja) సంతన్ చెన్నైలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీలంకకు చెందిన సంతన్...కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. లివర్ ఫెయిల్యూర్ సమస్యతో హాస్పిటల్‌లో చేరిన సంతన్...ఉదయం కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్టు తెలిపారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఓ సారి గుండెపోటు వచ్చిందని, ఆ సమయంలో CPR ఇచ్చి ప్రాణాలు కాపాడినట్టు వివరించారు. అయితే...ఆ తరవాత మరోసారి తీవ్రంగా గుండె పోటు వచ్చిందని తెలిపారు. 1991లో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. మొత్తం ఈ హత్యలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి జైల్లో వేశారు. వీళ్లలో ముగ్గురికి మరణశిక్ష విధించారు. అందులో సంతన్ కూడా ఉన్నారు. 1999లో ఈ తీర్పుని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కానీ ఆ తరవాత ఆ తీర్పుని మార్చేశారు. 2022 నవంబర్‌లో అందరినీ విడుదల చేశారు. ఆ సమయంలోనే సంతన్ కూడా విడుదలయ్యాడు. తిరుచ్చిలోని ఓ స్పెషల్‌ క్యాంప్‌లో ఉంటున్నాడు. శ్రీలంకకు వెళ్లేందుకు ఈ మధ్యే లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకి ఈ విషయం వివరించింది. టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్స్‌తో శ్రీలంకకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. కానీ..ఈ లోగా గుండెపోటుతో సంతన్ మృతి చెందాడు. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగింది. LTTE ఇంటిలిజెన్స్‌లో పని చేస్తున్న సంతన్ ఈ హత్యలో కీలక పాత్ర పోషించాడు. 


రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు 2022 నవంబర్‌లో విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో వీళ్ల ముక్తి లభించింది. వీళ్లను విడుదల చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా...తమకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు దోషులు. వీరిలో నలుగురు శ్రీలంకకు చెందిన వాళ్లున్నారు. వాళ్లను తమ సొంత దేశానికి పంపించే పనిలో ఉన్నారు అధికారులు. మురుగన్ అలియాస్ శ్రీహరన్, రాబర్ట్ పయాస్, ఎస్ జయకుమార్, శంతన్‌లను శ్రీలంకకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ...తమిళనాడు ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ నలుగురినీ...తమిళనాడులోని తిరుచ్చిలో ఓ స్పెషల్ క్యాంప్‌లో ఉంచారు. 


ఈ తీర్పు తరవాత నళిని శ్రీహరన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. "ఈ హత్య చేసినందుకు మీకు గిల్టీగా అనిపించడం లేదా" అని ప్రశ్నించగా...చాలా బ్యాలెన్స్‌డ్‌గా సమాధానం చెప్పారు నళిని. "అసలు నాకీ హత్యతో ఎలాంటి సంబంధం లేదు. ప్రపంచానికి నేనో దోషినే కావచ్చు. కానీ...అప్పుడేం జరిగిందో, నిజానిజాలేంటో నా మనస్సాక్షికి తెలుసు" అని బదులిచ్చారు. ఆ హత్య చేసిన గ్రూప్‌లో ఒకరిగా ఉండటం వల్లే అనుమానించి నాపై హత్యానేరం మోపారని వివరించారు. "హత్యకు పాల్పడిన వాళ్లంతా నా భర్త స్నేహితులు. నాకు వాళ్లతో కొంత పరిచయం ఉంది. నేను చాలా మితభాషిని. వాళ్లతో పెద్దగా ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్లకు అవసరమైన సాయం చేసే దాన్ని. వాళ్లతో పాటు  వెళ్లేదాన్ని. అంతకు మించి వాళ్లతో నాకు వ్యక్తిగత పరిచయాలు ఏమీ లేవు. అసలు వాళ్ల కుటుంబ నేపథ్యాలేంటో కూడా నాకు తెలియదు" అని చెప్పారు నళిని శ్రీహరన్.