Minister Ambati Rambabu Making Tea in Election Campaign: 'ఇప్పటి వరకూ నా పని నేను చేశాను. ఇక నుంచి పూర్తిగా మీరే పని చేయాలి. మనం చేసిన, చేసే మంచి పనులను ప్రజలకు వివరించండి.' ఇదీ మంగళవారం పార్టీ శ్రేణులకు సీఎం జగన్ (CM Jagan) చేసిన దిశా నిర్దేశం. ఆయన ఆదేశాలకు అనుగుణంగా మంత్రులు, పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు.. తమ పని ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 'వై నాట్ 175' అనే సీఎం జగన్ నినాదాన్నే తమ లక్ష్యంగా మార్చుకుంటూ ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా, మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తనదైన శైలిలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో (Sattenapalli) ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఐదు లాంతర్ల సెంటర్ లోని ఓ షాపులో టీ మాస్టర్ అవతారం ఎత్తి స్వయంగా టీ తయారు చేశారు. అలాగే, మరో టిఫిన్ షాపులో దోశలు వేశారు. స్థానిక ప్రజలు, విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతా కలియతిరిగి ప్రభుత్వ పథకాలు, పొందిన లబ్ధిని అందరికీ వివరించారు. మంత్రి ప్రచారంతో వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.


'ఓటర్లను కలవండి'


ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి క్యాడర్ కు సీఎం జగన్ మంగళవారం కీలక సూచనలు చేశారు. 'మీ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు కనీసం ఐదారు సార్లు కలవండి. మనం చేసిన, చేసే మంచి పనులు చెప్పండి. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చెయ్యాలి. సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహరించాలి' అని దిశానిర్దేశం చేశారు. తమ తమ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు ఐదుసార్లు కలవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ పథకాలను, పనులను ప్రజలకు వివరించాలని చెప్పారు. మేము సిద్ధం.. బూత్ సిద్ధం వర్క్ షాప్ లో సీఎం జగన్.. వైసీపీ నేతలకు ఎన్నికల ప్రచారంపై  రూట్ మ్యాప్ ఇచ్చారు. రానున్న 45 రోజులు అత్యంత కీలకం అని సీఎం జగన్ అన్నారు.


ఇప్పటివరకు నేను నా పని చేశాను, ఇక నుంచి పూర్తిగా మీరే పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైందని.. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న మార్పులు తప్ప.. ఇంఛార్జీలే అభ్యర్థులుగా ఉంటారని స్పష్టం చేశారు. వైసీపీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని.. రానున్న రోజుల్లో ఏ వ్యూహంతో ముందుకెళ్లాలి? ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి? అన్న దానిపై సుదీర్ఘ సమావేశంలో శ్రేణులకు నిర్దేశించారు. ఈ క్రమంలో జగన్ వ్యూహాలకు అనుగుణంగా పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. వారితో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు.


Also Read: సీఎం జగన్‌ వ్యాఖ్యలతో ఆ నేతలు హ్యాపీ! ఇంతకీ ఏమన్నారంటే?