YSRCP News: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఇన్‌చార్జ్‌లకు ఉపశమనం కలిగించే వార్తను సీఎం జగన్మోహన్‌రెడ్డి అందించారు. ఎన్నికల నేపథ్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో తాడేపల్లిలో సీఎం జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఎంతో మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు మానసిక ప్రశాంతతను కలిగించాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏడు జాబితాల్లో 70 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో అనేక మార్పులు, చేర్పులను చేసింది. ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలిగించగా, ఎంతో మందికి సీట్లు నిరాకరించారు. ఈ నేపథ్యంలో మిగిలిన సీట్లకు సంబంధించి ఎన్ని మార్పులు ఉంటాయో అన్న ఆందోళన అభ్యర్థుల్లో, ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న నేతల్లో ఉంది. ఈ ఆందోళనలు, అనుమానాలను పటాపంచలు చేస్తూ సీఎం జగన్‌ శుభవార్తను అందించారు. ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జ్‌లు, సిటింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు దాదాపు ఖరారైనట్టే అంటూ సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో చాలా మంది నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా, మార్పులపై గంపెడాశలు పెట్టుకున్న నేతలకు మాత్రం నిరాశ తప్పలేదు. 


సీఎం జగన్‌ ఏమన్నారంటే..?


పార్టీ కీలక నాయకులు, ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన సీఎం జగన్‌.. ఇప్పటి వరకు టికెట్లన్నీ దాదాపు కన్ఫార్మ్‌ అయినట్టేనని పేర్కొన్నారు. ఇప్పటికే మార్చాల్సిన 99 శాతం మార్చామని, ఇంకా ఒకటి, అరా తప్పా.. దాదాపు అందరికీ సీట్లు ఖరారైనట్టేనని సీఎం వెల్లడించారు. సీట్లు కన్ఫార్మ్‌ అయ్యాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్లాలని, గడిచిన ఐదేళ్లలో ప్రజలకు చేసిన మంచిని క్షుణ్ణంగా వివరించాలని ఆయన సూచించారు. సీఎం చెప్పిన మాటలను బట్టి వైసీపీ మిగిలిన 105 స్థానాలకు మార్పులను చేసే అవకాశం లేదని తెలుస్తోంది. మరీ ఇబ్బందిగా ఉన్న ఒకటి, రెండు చోట్ల మాత్రమే మార్పులు ఉంటాయని సీఎం నేరుగా ప్రకటన చేయడంతో.. ఇప్పటి వరకు సీటు వస్తుందో..? రాదో..? అన్న ఆందోళనతో ఉన్న నేతలంతా ఖుషీ అవుతున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశముందని చెబుతన్నారు. 


నిరాశలో ఆశావహ అభ్యర్థులు


సీఎం తాజా ప్రకటన ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి, ఇన్‌చార్జ్‌లు కొనసాగుతున్న వారికి సాంత్వన కలిగించగా, ఆశావహ అభ్యర్థులకు మాత్రం నిరాశను మిగిల్చింది. వైసీపీకి 175 నియోజకవర్గాల్లోనూ సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. సీనియర్‌ నేతలు, పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు ఉన్న చోట్ల మినహా అనేక చోట్ల ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులు సీట్లు కోసం పోటీ పడుతున్నారు. వీరంతా ఇప్పటి వరకు జరిగిన మార్పులను చూసి తమకు అవకాశం దక్కుతుందని భావిస్తూ వచ్చారు. టికెట్ల కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తూ వున్నారు. కానీ, సీఎం తాజా ప్రకటనతో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనేక మంది నేతలకు ఏర్పడింది. వీరంతా సీఎం ప్రకటన నేపథ్యంలో ఏం చేస్తారన్న ఆసక్తి నెలకొంది.