అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశం కోసం శ్వేతసౌధానికి విచ్చేసిన మోదీకి అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్వేతసౌధం బయట ప్రవాస భారతీయులు.. మోదీని సాదరంగా ఆహ్వానించారు. మోదీతో భేటీకి ముందు బైడెన్ ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీతో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నాను. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తాను. ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని సురక్షితంగా ఉచ్చేందుకు అవసరమైన చర్యలపై చర్చిస్తాను. కొవిడ్-19, వాతావరణ మార్పులపైనా అభిప్రాయాలు పంచుకుంటాం. - జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ఈ అంశాలపైనే చర్చ..
- వాణిజ్యం, పెట్టుబడి సంబంధాల బలోపేతం, రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరిగనున్నట్లు సమాచారం.
- తీవ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు చర్చించనున్నారు.
- అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిణామాలపై కూడా ఇరుదేశాధినేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది.
క్వాడ్ సదస్సు..
బైడెన్‌తో భేటీ తర్వాత క్వాడ్ సదస్సుకు మోదీ హాజరవుతారు. టీకాల సరఫరా, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణపై రంగంలోనూ ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లపైనా క్వాడ్ దేశాధినేతలు చర్చలు జరుపనున్నారు.