అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేశామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుమల అన్నమయ్య భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా సాంకేతిక పరిజ్ఞనాన్ని వినియోగించామని తెలిపారు. మొదటి సారి క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా టిక్కెట్లను ఆన్లైన్ లో విడుదల చేశామని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూ ఉండడంతో దర్శనానికి డిమాండ్ పెరిగిందన్నారు. ఆగష్టు,సెప్టెంబర్ నెలలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల సమయంలో సాంకేతికపరంగా సమస్యలు తలెత్తాయన్నారు. 


Also Read: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ సర్టిఫికేట్ ఉంటేనే దర్శనం.. కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిన టీటీడీ


దుష్ప్రచారాలు సరికాదు


టీటీడీకి క్లౌడ్ మెనెజ్మెంట్ సేవలు ఉచితంగా అందించేందుకు జియో సంస్థ ముందుకు వచ్చిందని ధర్మారెడ్డి అన్నారు. జియో, టీసీఎస్ తో టీటీడీ ఐటీ ఉద్యోగులు నిరంతరం పని చేసి అక్టోబర్ నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదలకు ప్రోగ్రామింగ్ చేశారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కొంత మంది టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని, పనిగట్టుకుని ప్రచారాలు చేయడం సబబుకాదన్నారు. 2.31 లక్షల టిక్కెట్ల కోసం కోటికి పైగా హిట్లు వచ్చాయని పేర్కొన్నారు. రేపు సర్వదర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తామన్నారు. రేపటి రోజున టిక్కెట్లు విడుదల సమయంలో సమస్యలు తల్లెత్తకుండా ఉండేందుకు జియో, టీసీఎస్ తో టీటీడీ ఐటీ అధికారులు సమావేశం నిర్వహిస్తారని అన్నారు. 


Also Read: శ్రీవారి దర్శనం కోసం అలా వెళ్తే మోసపోవడమే! ఇలా చేస్తే చాలా సేఫ్


జియో ఫ్రీ సర్వీస్


సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని ఛానెల్స్ లో టీటీడీపై విమర్శలు చేస్తున్నారని అది సరికాదని ధర్మారెడ్డి అభిప్రాయ పడ్డారు. టీటీడీ వ్యవస్థను ముఖేశ్ అంబానికి అందించినట్టు కథనాలు రావడం బాధాకరమని చెప్పారు. గతంలో మూడు నెలలకు సంబంధించి 18 లక్షల టికెట్లను విడుదల చేసే వాళ్ళమని, ప్రస్తుతం కరోనా కారణంగా నెలకు 2.40 లక్షలు మాత్రమే ఇస్తున్నామన్నారు. ముఖేశ్ అంబాని స్వామి వారికి మహా భక్తులని, వాళ్ళ ఇచ్చిన  విరాళంతో నేడు అలిపిరి నడక మార్గం పైకప్పు పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు. టీటీడీకి ఫ్రీ సర్వీస్ చేస్తామని జియో ముందుకొచ్చిందన్నారు. క్లౌడ్ ద్వారా ఈసారి విడుదల చేసే టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.


Also Read: టీటీడీలో కొత్త వివాదం ! "జియో మార్ట్‌"కు శ్రీవారి దర్శన టిక్కెట్ల బుకింగ్ కాంట్రాక్ట్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి