టమోటా సామాన్యుడికి టాటా చెబుతోంది. పచ్చిమిర్చి ధర వింటేనే గొంతు మండిపోయేలా ఉంది. ఇలా ఏ కూరగాయ ధర చూసుకున్నా గుండె ధడ మొదలవుతోంది. ప్రస్తుతం టమోటా వంద రూపాయలకుపైగానే పలుకుతోంది. పచ్చిమిర్చి 150 రూపాయలకు సమీపంలో ఉంది. కిలో 50 రూపాయల కంటే తక్కువ ఏదీ లేదు. ఉల్లి మాత్రమే వందకు మూడు నాలుగు కిలోలు ఇస్తున్నారు. అది ఒక్కటి మినహా వేరే ఏ కూగాయలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. 


వెయ్యి తీసుకెళ్తే


కూరగాయలు కొందామని వెయ్యిరూపాయలు పట్టుకెళ్తే కిలో చొప్పున గట్టిగా 10 రకాల కూరగాయాలు కొనే పరిస్థితి లేదు. అందుకే చాలా మంది అర్థకిలో, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. మంచి కారం ఉన్న పచ్చి మిర్చి 150 రూపాయల వరకు ఉంది. ఒకానొక దశలో ఇది 200 రూపాయల వరకు వెళ్లి రెండు రోజులుగా కాస్త తగ్గింది. టమోటా అయితే పెట్రోల్‌లా మండుతోంది. ప్రస్తుతం వంద రూపాయల వద్ద ఉంది. ఇది మరింత పెరిగే అవకాశందని సమాచారం. 


అందని ఆకు కూరలు


అరటి కాయలు ఒక్కొక్కటి 20 రూపాయలు చెబుతున్నారు. మునక్కాయలు అయితే ఒకటి పది రూపాయలు చెబుతున్నారు. ఆకు కూరల సంగతి సరే సరి. ఒకప్పుడు 20 రూపాయలు ఇస్తే ఇంటిళ్లపాది ఏదైనా ఆకుకూర తినేటోళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండు చిన్న చిన్న కట్టలు కట్టి 20 రూపాయలు చెబుతున్నారు. గట్టిగా తింటే ఒకరి కూడా సరిపోని పరిస్థితి ఉంది. పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చల కూర ఇలా ఏ ఆకు కూర తీసుకున్నా ఇదే పరిస్థితి. కొత్తిమీర, పుదీనా అయితే వాసన చూడటానికి కూడా వీల్లేనంతగా పెరిగిపోయింది. 


తగ్గిన సరఫరా


మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు సరఫరా పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే కూరయగాయల ధరలు ఇంతలా మండిపోతున్నాయని అంటున్నారు. మరో నెల రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.  


ప్రస్తుతం అమల్లో ఉన్న కూరగాయల ధరలు


టమోట- 100
పచ్చిమిర్చి 120
కాకరకాయ- 70
దొండకాయ- 50
బెండకాయ-50
బీన్స్‌-80
క్యారెట్‌-60
వంకాయ-50
బీరకాయ- 60
గోరుచిక్కుడు- 60



చివరకు నాన్‌వెజ్‌ ధరలు మండిపోతున్నాయి. కోడిగుడ్డు ధర 7 రూపాయలకు చేరుకుంది. చికెన్‌ 300 వరకు ఉంది. మటన్ ఎప్పుడో ఉన్నత వర్గాల వస్తువుగా మారిపోయింది. 


కోడి గుడ్డు- 7 రూపాయలు
చికెన్-300
మటన్ - 800


పచ్చిమిర్చి, టమోటా, క్యారెట్‌, క్యాప్సికమ్‌  కర్ణాటక నుంచి రావాల్సి ఉంది. బంగాళదుంపలు గుజరాత్‌ నుంచి రావాల్సి ఉంది. మరికొన్ని కూరగాయలు కర్నూలు నుంచి రావాల్సి ఉంది. వాతావరణం పరిస్థితులు,  స్థానికంగా ఉన్న డిమాండ్ మేరకు అక్కడి నుంచి సరఫరా తగ్గిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. అందుకే వంటింట్లో మంటలు వస్తున్నాయని అంటున్నారు వ్యాపారులు. 


టమోటా ధరల పెరుగుదలకు కారణం 


మహారాష్ట్రలో పంట నష్టం జరిగింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేయడంతో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ఏడాది సాధారణం కంటే 30 శాతం పంట దిగుబడి తక్కువగా ఉందని కోలార్ కు చెందిన రైతులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే టమాటా ధరలు చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఒకేసారి భారీగా టమాటా దిగుబడి రావడం, సాగు కూడా అధిక మొత్తంలో ఉండటంతో గతేడాది కేజీ టమాటా రూ.5కు పడిపోయింది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial