President Droupadi Murmu:
అసోంలో పర్యటన..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం అసోం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె తేజ్‌పూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించారు. అంతే కాదు. సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణం చేసిన నాలుగో భారత రాష్ట్రపతిగా నిలిచారు. అంతకు ముందు గౌరవ వందనం అందుకున్న ఆమె...ఆ తరవాత సుఖోయ్‌లో ప్రయాణించారు. ఫ్లైయింగ్ సూట్ వేసుకుని కాసేపు సుఖోయ్‌లో విహరించారు. గ్రూప్ కేప్టెన్ నవీన్ కుమార్ తివారీ ఈ క్రాఫ్ట్‌ను నడిపారు. సుఖోయ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించడం ఎంతో గొప్ప అనుభూతిని పంచిందని ద్రౌపది ముర్ము వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ బ్రీఫ్ నోట్ విడుదల చేశారు.
"సుఖోయ్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణించడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది. దేశ రక్షణ శాఖ ఇంత బలోపేతం అవడం నిజంగా గర్వంగా ఉంది. సముద్ర జలాలైనా, గగనతలంలోనైనా భారత్ ఈ స్థాయిలో పురోగతి సాధించడం గొప్ప విషయం. ఈ అవకాశం ఇచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి, ఇతర సిబ్బందికి నా ధన్యవాదాలు"
- ద్రౌపది ముర్ము,భారత రాష్ట్రపతి
2 కిలోమీటర్ల ప్రయాణం..
దాదాపు 2 కిలోమీటర్ల పాటు సుఖోయ్‌లో ప్రయాణించారు ముర్ము. సముద్ర మట్టానికి 800 కిలోమీటర్ల ఎత్తులో విహరించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా అసోంకు వచ్చారు రాష్ట్రపతి. మొదట కజిరంగ నేషనల్ పార్క్‌లోని గజ్ ఉత్సవాన్ని ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కార్యక్రమం మొదలై 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం (ఏప్రిల్ 6న)ఆమె అసోంకు చేరుకున్నారు. గవర్నర్ గులాబ్ చంద్ కటారియా,ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆమెకు గౌరవ స్వాగతం పలికారు. గజ్ ఉత్సవాన్ని ప్రారంభించిన సమయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఏనుగులతో మనుషులకున్న ఘర్షణను తగ్గించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని స్పష్టం చేశారు. మౌంట్ కాంచనగంగ సాహసయాత్ర - 2023ను ప్రారంభించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలనూ వీక్షించారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2009లో సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. ఆ తరవాత అబ్దుల్ కలాం కూడా ఇదే ఎయిర్‌క్రాఫ్ట్‌లో విహరించారు.