Congress Leader Threatens Judge:
రాహుల్‌కు శిక్ష వేసిన జడ్జ్‌పై కామెంట్స్..
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. తమిళనాడులోనూ కాంగ్రెస్ నేతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా...నినాదాలు చేస్తున్నారు. అయితే...ఓ కాంగ్రెస్ లీడర్ హద్దు దాటి నినాదాలు చేశారు. రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన జడ్జ్ నాలుక కట్ చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు...ఆయనపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ దింగల్ జిల్లా అధ్యక్షుడు మణికందన్ ఈ కామెంట్స్ చేశారు. "మేం అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన జడ్జ్ నాలుకను కోసేస్తాం" అని తీవ్ర పదజాలంతో మాట్లాడారు. ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
"మార్చి 23వ తేదీన సూరత్ కోర్టు జడ్జ్ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. మేం అధికారంలోకి రాగానే ఆ జడ్జ్ నాలుక కోసేస్తాం. ఎవరికి శిక్ష విధించారో అర్థమవుతోందా..? ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టింది ఎవరు..? మా రాహుల్ గాంధీ కుటుంబం కాదా..? కాంగ్రెస్ ఉద్యమం వల్లే స్వాతంత్య్రం రాలేదా..?. మీరు ఇంత స్వతంత్రంగా ఉండగలుగుతున్నారంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీయే. అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ప్రజలు మౌనంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్లు అన్నీ గమనిస్తున్నారు. వాళ్లు కచ్చితంగా బీజేపీని దేశం నుంచి తరిమికొడతారు. "
- మణికందన్, కాంగ్రెస్ నేత
ఈ స్పీచ్ ఇచ్చిన వెంటనే చుట్టూ ఉన్న కాంగ్రెస్ నేతలు చప్పట్లు కొడుతూ ప్రశంసించారు. పోలీసులు మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన వెంటనే ఆయన అధికారిక నివాసమైన బంగ్లాను ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి తన ఆఫీస్‌ను తరలించే పనిలో ఉన్నారు రాహుల్. కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ తమ ఇంటికి రావాలంటూ వెల్‌కమ్ చెప్పారు. ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే..రాహుల్ గాంధీ 10 జన్‌పథ్‌లోని తన తల్లి సోనియా గాంధీ ఇంటికి షిఫ్ట్ అవనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాహుల్ బంగ్లాలోని సామాన్లను సోనియా ఇంటికి తరలిస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఆఫీస్ కోసం మరో ఇంటినీ వెతుకున్నారని తెలుస్తోంది.